ఏం సందేశం ఇస్తున్నావు అధ్యక్షా?
● పోలీసులతో గూడూరు ఎమ్మెల్యే రహస్య మంతనాలు ● రౌడీయిజం చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ● ఆపై రౌడీలను ప్రోత్సహించే విధంగా కార్యకలాపాలు ● విస్తుపోతున్న స్థానికులు!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు ఎమ్మెల్యే తీరు స్థానికులను విస్మయానికి, గందరగోళానికి దారితీస్తోంది. ఆయన పోలీసులతో రహస్య సమావేశాలు నిర్వహించి రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశిస్తున్నారు. సభలు సమావేశాల్లోనూ రౌడీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆపై రౌడీ షీటర్ల పుట్టిన రోజు వేడుకలు, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యక్రమాలకు వెళ్తూ వారిని మరింత ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమి చేయాలో దిక్కుతోచక రౌడీ షీటర్లతో సఖ్యతగా ఉంటున్నారు. వారికి ప్రతి పనిలోనూ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఐడీ కానిస్టేబుళ్లు అయితే రౌటీ షీటర్ల అనుచరులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశమైంది.
పట్టించుకుంటే ఒట్టు
నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా దానికి కేంద్ర బిందువుగా గూడూరులోని రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు విచారణలో తేలుతోంది. గూడూరుకు చెందిన ఓ రౌడీషీటర్ చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పబ్లిక్‌గా దాబా నడుపుతున్నారు. అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నా పోలీసులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో గూడూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో దాబాకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారంటూ డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు వ్యకిపై బెదింపులకు దిగి ఫిర్యాదును ఉప సంహరించుకునేలా చేశారు. అదే రౌడీ షీటర్ దాబా వద్ద తనతో పాటుగా తిరుగుతున్న ఓ యువకుడ్ని వారం రోజుల క్రితం తన అనుచరులతో కలసి హత్య చేశారు. ఆపై వాకాడు ప్రాంతంలో శవాన్ని పారేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజాప్రతినిధుల నుంచి వీరికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఇన్ని హత్యలు, రౌడీయిజం, అక్రమాలు లాంటి దారుణాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment