పంచెకట్టు..దోచిపెట్టు!
రాహు–కేతు పూజలకు పంచెలు ధరించాలని నిర్ణయం
ముందుగా ప్రచారం లేకుండా 15 రోజుల క్రితం నిర్ణయం
శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో వ్యాపారుల దోపిడీ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అధికారుల నిర్ణయాలు వ్యాపారులకు వరంగా మారాయి. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా అనుకున్నదే తడువుగా నిర్ణయాలు అమలు చేస్తుండడంతో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రాహు–కేతు పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలని ఆలయ అధికారులు 15 రోజుల క్రితం నిబంధనలు పెట్టారు. ఈ సంప్రదాయం మంచిదే అయినప్పటికీ ముందుగా ప్రచారం చేసి ఉంటే భక్తులందరికీ తెలిసేది.
ఉన్నపళంగా సంప్రదాయ దుస్తుల నిబంధన పెట్టడం శ్రీకాళహస్తి పట్టణంలోని కొందరు వ్యాపారులకు వరంగా మారింది. తెల్లవారు జామున బస్సులు, రైళ్లల్లో, వివిధ వాహనాల్లో ఆలయానికి వచ్చే భక్తులను కొందరు వ్యాపారులు రోడ్లపై అడ్డగించి నిలువు దోపిడీ చేస్తున్నారు. రాహు–కేతు పూజలు చేయించుకోవాలంటే తప్పనిసరిగా పురుషులు పంచెలు ధరించాలని భయపెడుతున్నారు. కొందరు మహిళలు కూడా వ్యాపారం చేస్తుండడంతో పురుష భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రూ.200 విలువ చేసే పంచెను రూ.500కు అంటగడుతున్నారు. నిబంధనలు తెలియక భక్తులు వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నారు.
పట్టణంలోని తేరువీధిలో ఉన్న కొందరు వ్యాపారులు, భిక్షాల గాలిగోపురం, శివయ్య గోపురం ద్వారా వచ్చే భక్తులు దోపిడీకి గురవుతున్నారు. స్వామి, అమ్మవార్ల అర్ధ మండపం దర్శనం, అభిషేకాలకు మాత్రం సంప్రదాయ వస్త్రధారణ నిబంధన ఉంది. దీనిని సక్రమంగా అమలు చేయలేని అధికారులు రాహు–కేతు మండపాల్లో సంప్రదాయ వస్త్ర నిబంధన అమలుచేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇదిలాగే కొనసాగితే ఆలయ ఆదాయానికి గండిపడే ప్రమాదముంది. పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తున్నా స్థానిక కూటమి నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ఆలయ అధికారుల నిర్ణయాలను సమర్థిస్తున్నారు. ఉన్నతాఽధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment