ఓసీ సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి రామారావు
టవర్‌సర్కిల్: రాజకీయ పార్టీల నాయకులు ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకుని పేదలందరికీ సమన్యాయం చేసేవరకూ ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య నిరంతరం పోరాటం చేస్తుందని ఓసీ సంక్షేమ సంఘాల తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఇన్‌చార్జి పోలాడి రామారావు పేర్కొన్నారు. ఈనెల 27న నల్లగొండలో నిర్వహించే ఓసీ మహాగర్జన సభ ఏర్పాట్లపై జిల్లా ఓసీ ఐకాస సంఘాల నాయకులతో నగరంలోని సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విద్య, ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను అగ్రకుల నిరుపేదలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఏడు దశాబ్దాలుగా 80 శాతం ఓసీ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందక విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురై దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లకు ముగింపు పలకాల్సిన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్షంగా ఏటేటా పెంచుతూ అగ్రకుల పేదలను తీవ్రంగా నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కుల, మతాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు వర్తింపజేసి సమన్యాయం జరిపేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని రద్దు చేసి ప్రతిభ, సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలన్నారు. రూ.వెయ్యి కోట్లతో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించి స్వయం ఉపాధి పథకాల కోసం 80 శాతం రాయితీతో రుణాలు అందించాలన్నారు. ఓసీ ఐకాస సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఓసీ మహాగర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.