ఓటు ఓ చోట..ఓటరు మరోచోట
ఓటు ఓ చోట..ఓటరు మరోచోట
Published Wed, Nov 30 2016 10:31 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
– పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై విమర్శలు
– రూరల్ ఓటర్లకు కర్నూలులో ఓటు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటుపై విమర్శలు వస్తున్నాయి. ఏడుగురు ఓటర్లకే ఓ పోలింగు బూత్‌ను ఏర్పాటు చేయడం.. గ్రామీణ ప్రాంత ఓటర్లకు కర్నూలులో ఓటే వేసే హక్కును కల్పించడాన్ని చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి/ఏప్రిల్ నెలల్లో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నవంబర్ 5వ తేదీ వరకు ఓటరు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరించారు. కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల నుంచి ఏడు వేలు, పట్టభద్రుల నుంచి 87 వేల దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ ఓటు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా 112 పోలింగు బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్క కర్నూలు మాత్రమే 30 కేంద్రాలు ఉన్నాయి. మిగతావన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అధికారుల డొల్లతనం బయటపడింది. వచ్చిన దరఖాస్తులను కనీస పరిశీలన చేయకుండా, ఓటర్లతో మాట్లాడకుండా కార్యాలాయాల్లో కూర్చొని పోలింగు బూత్‌లను కేటాయించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కర్నూలులోని 266 పోలింగు బూత్(పొట్టి శ్రీరాములు మునిసిపల్ హైస్కూల్)లో కేవలం ఏడుగురు ఓటర్లకు కేటాయించారు. వీరు కూడా నగరంలోని శ్రీరామ్‌నగర్, లక్ష్మీనగర్, స్టాంటన్‌పురం, కృష్ణానగర్, ప్రకాష్‌నగర్, చిత్తారివీధి తదితర ప్రాంతాలకు చెందిన వారు. వీరందరూ కూడా పోలింగు బూత్‌కు సమీపంలో ఎవరూ నివాసం ఉండరు. అలాగే 267, 268 పోలింగు బూత్‌లలో 15, 12 మంది ఓటర్లే ఉన్నారు. ఇక 273 బూత్‌లో 36 మంది, 277 బూత్‌లో 18 మంది, 280 వ బూత్‌లో 22 మంది ఓటర్లు ఉన్నారు.
గ్రామీణ ప్రాంత ఓటర్లకు కర్నూలులో ఓటుహక్కు
వన్‌టౌన్ సమీపంలోని ఇస్లామియా డిగ్రీ కళాశాలలో 260వ పోలింగు బూత్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 764 మంది ఓటర్లను కేటాయించారు. ఇందులో డోన్, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వారికి ఓటు హక్కును కల్పించారు. అంతేకాక కర్నూలులోని 20 ప్రాంతాల వారికి ఇక్కడ ఓటు వేసే హక్కును కల్పించారు.
టీడీపీకి అనుకూలంగా ఏర్పాటు: సీపీఎం
పోలింగు బూతుల గుర్తింపులో అధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యహరించారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్ ఆరోపించారు. బుధవారం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఒక్క కేంద్రంలో కూడా సరైన పద్ధతిలో ఓటర్లను కేటాయించలేదని ధ్వజమెత్తారు. ఈ తతంగంపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీ అభ్యర్థుల వినతులను స్వీకరించి తప్పులను సరిచేయాలని, లేదంటే రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా నాయకులు నారాయన పాల్గొన్నారు.
Advertisement