సింగరేణి పీఅండ్‌పీ కార్యాలయం
- సింగరేణి చిక్కులు.. రెవెన్యూ పరుగులు
- పీఅండ్‌పీ భవనాన్ని ఇవ్వలేమన్న అధికారులు
- ఇప్పటికే ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు
కొత్తగూడెం : కార్యాలయాల కోసం నెల రోజుల కసరత్తు.. ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు.. అప్పుడే మొదలైన చిక్కులు.. ప్రభుత్వ కార్యాలయాలకు ఆ భవనాలు ఇవ్వలేమన్న సింగరేణి అధికారులు.. మళ్లీ భవనాల కోసం రెవెన్యూ అధికారుల పరుగులు.. జిల్లా ఏర్పాటుకు నెల రోజులు మాత్రమే సమయం.. ప్రతిపాదనలు మార్చి మళ్లీ పంపించడం రెవెన్యూ అధికారులకు తలనొప్పిలా మారింది. తొలుత భవనాలు ఇస్తామని.. ఇప్పుడు ఇవ్వమని చెప్పడం ఇబ్బంది కలిగిస్తోంది.
కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సింగరేణి తిరకాసు పెడుతోంది. కలెక్టరేట్‌గా సింగరేణి పీఅండ్‌పీ భవనం అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని భావించిన రెవెన్యూ అధికారులు సింగరేణి అధికారులతో చర్చలు జరిపారు. వారి అంగీకారం మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండు రోజుల క్రితం సింగరేణి అధికారులు పీఅండ్‌పీ భవనాన్ని ఇవ్వలేమని.. దానికి బదులు పోస్టాఫీస్ సెంటర్‌లోని సింగరేణి గర్ల్స్ హైస్కూల్ లేదా రామవరంలోని సింగరేణి ఉమెన్స్ హాస్టల్(పాత బాయ్స్ హైస్కూల్)ను అప్పగిస్తామని పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు భవనాల కోసం మళ్లీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి గర్ల్స్ హైస్కూల్ ప్రధాన సెంటర్‌లో ఉండటంతోపాటు కార్యాలయానికి అనువుగా ఉన్నా.. భవనంలో చాలా వరకు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం పార్కింగ్ స్థలం అంత అనువుగా లేదు. ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలంగా ఉన్న పీఅండ్‌పీ భవనాన్నే కేటాయించాలని సింగరేణి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు ఆర్డీఓ రవీంద్రనాథ్, తహసీల్దార్ అశోక చక్రవర్తి శుక్రవారం సాయంత్రం వరకు సింగరేణి అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే సింగరేణి అధికారులు మాత్రం గర్ల్స్ హైస్కూల్‌ను కలెక్టరేట్ కోసం తీసుకోవాల్సిందిగా చెబుతున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
సింగరేణి గర్ల్స్ హైస్కూల్‌లో ప్రస్తుతం 900 మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. అయితే పాఠశాల భవనాన్ని కలెక్టరేట్ కోసం అప్పగిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ చేస్తారని అటు విద్యార్థులు, ఇటు స్కూల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ముందు అనుకున్న ప్రకారమే పీఅండ్‌పీ భవనాన్ని కలెక్టరేట్ కోసం అప్పగించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో పాఠశాలను తరలించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, దీనిపై యాజమాన్యం మరోమారు ఆలోచించాల్సి ఉంటుందంటున్నారు. ఏదేమైనా సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రస్తుత నిర్ణయం సింగరేణి స్కూల్ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తుండగా.. రెవెన్యూ అధికారులను మాత్రం పరుగులు పెట్టిస్తోంది.