వావ్ వండరర్స్ | Wanderers Club special story | Sakshi
Sakshi News home page

వావ్ వండరర్స్

Published Sat, Apr 2 2016 2:03 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వావ్ వండరర్స్ - Sakshi

వావ్ వండరర్స్

15 ఏళ్ల క్రితం బైకర్స్ క్లబ్ అంటే హైదరాబాద్‌లో పెద్ద విశేషం. మరిప్పుడో... దాదాపు డజన్ పైగానే బైకర్స్ క్లబ్‌లు సిటీ వేదికగా దూసుకొచ్చేశాయి. ఈ వెల్లువకు ఊపిరి పోసింది బుల్లెట్‌ప్రియుల అభిరుచి. హాబీనే ఆధారంగా చేసుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్స్ స్థాపించిన ‘వాండరర్స్’ క్లబ్... దేశంలోనే అత్యధిక సంఖ్యలో సభ్యులు, అత్యంత క్రమశిక్షణ గల క్లబ్‌గా పేరొందింది. అంతే కాదు సామాజిక బాధ్యతలోనూ ‘రయ్’మంటూ దూసుకుపోతున్న ఈ క్లబ్ 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా క్లబ్ విశేషాల సమాహారం...
- సాక్షి, హైదరాబాద్

డుడ్..డుడ్..డ్ శబ్దంతో అర కిలోమీటర్ దూరం నుంచే తన ఉనికిని చాటుతుంది. రోడ్డు మీదకు వెళ్లిందంటే అందరి కళ్లు తనపైకే లాగేస్తుంది. రాజసం, హుందాతనం, ఠీవి, అందం, దర్పం.. బైక్‌కి జతచేయడం అనేది మొదలు పెట్టిందే రాయల్ ఎన్‌ఫీల్డ్. ఒక బైక్ మనిషికి స్టేటస్ సింబల్‌గా మారడం మొదలైందీ దీనితోనే. అందుకే దీనికి అంత క్రేజ్. హైదరాబాద్ వేదికగా ఆవిర్భవించిన వాండరర్స్ క్లబ్‌కి ఈ క్రేజే ఆధారం.

బైకర్స్.. మెసేంజర్స్
ఫన్, జాయ్‌ఫుల్‌గా గడిపేందుకే కాదు.. సామాజిక బాధ్యతగా రకరకాల సందేశాలనూ మోసుకుంటూ రైడ్స్ నిర్వహిస్తోందీ ఈ క్లబ్ . పొల్యూషన్, హెల్మెట్ అవేర్‌నెస్,  సెల్యూట్ అవర్ ఆర్మీ, రక్తదానం, అనాథ పిల్లల కోసం రైడ్, హెరిటేజ్ రైడ్, పర్యావరణ పరిరక్షణ,.. ఇలా అనేక అంశాలను బేస్ చేసుకొని రైడ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సూసైడ్ దేనికీ పరిష్కారం కాదనే సందేశంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైడ్ చేస్తున్న సనా ఇక్బాల్ ఈ క్లబ్ సభ్యురాలే. అలాగే ప్రతినెల ఆర్‌టీఏ, షీటీమ్స్, ట్రాఫిక్ విభాగాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి డిసెంబర్‌లో ‘నో యువర్ బైక్’ కార్యక్రమం నిర్వహిస్తారు.

 సభ్యత్వమిలా..
ఈ క్లబ్‌లో చేరడానికి ఎలాంటి ఫీజు లేదు. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపితే.. సొంత రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనం, డ్రైవింగ్ లెసైన్స్ పత్రాలను ధ్రువీకరించి రైడ్‌లో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. మీటప్ అయినా, రైడింగైనా షూస్, హెల్మెట్ తప్పనిసరి. వాండరర్స్ గ్రూప్స్ అన్నింట్లోనూ ఒకే విధమైన నిబంధనలు పాటిస్తారు. వీరి ఫేస్‌బుక్ పేజీ ద్వారా బుల్లెట్‌కి సంబంధించిన సాంకేతిక విషయాలు, క్రయవిక్రయాలు, స్పేర్ పార్ట్స్ లభించే ప్రదేశాలు, మెకానిక్‌ల అడ్రస్‌లు.. ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

 పరుగు పద్నాలుగు..
హైదరాబాద్‌లో మొట్టమొదటి బైకర్స్ క్లబ్ ‘వాండరర్స్- బుల్లెటీర్స్ ఆఫ్ హైదరాబాద్’. 2002లో ఐదారుగురు సభ్యులతో మొదలైందీ క్లబ్. ప్రస్తుతం బీదర్, ఢిల్లీ,  డెహ్రడూన్, నాందేడ్, లాతూర్, ముంబై, బెంగళూర్‌లో సైతం వాండరర్స్ గ్రూప్‌లున్నాయి. గ్రూప్‌గా బైక్ రైడింగ్‌లకు రెగ్యులర్‌గా వెళ్లడంతో మొదలై క్లబ్‌గా రూపాంతరం చెందామని గుర్తు చేసుకున్నారు దీని ఫౌండర్ లలిత్ జైన్. ‘అప్పట్లో డ్రంకన్ డ్రైవ్ ఎక్కువ. హెల్మెట్ పెట్టుకునే వాళ్లు కాదు. క్రమశిక్షణ తప్పనిసరని చెబితే కొంత మంది వెళ్లిపోయారు. రైడర్స్‌ను సివిలైజ్‌డ్ రైడర్స్‌గా మార్చేందుకు టైం పట్టింది. ఇప్పుడు ఇండియాలోనే క్రమశిక్షణ గల రైడర్స్ క్లబ్‌గా గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నా’రు లలిత్ జైన్.

 రైడ్ అంటే జోష్.. స్పీడ్ కాదు..
‘రైడ్ అంటే జోష్. స్పీడ్ కాదు. హైవేల మీద 60-70 కి.మీ, సిటీలో అయితే 40-50 కి.మీ వేగం సరిపోతుంది. హైవేలపై 120 కి.మీ వేగంతో దూసుకు వెళ్లినప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణాలతో బయటపడే అవకాశం తక్కువ. మాతో పాటు కాలేజ్ స్టూడెంట్స్‌ని రెగ్యులర్‌గా రైడ్‌కి తీసుకువెళ్తాం. హెల్మెట్ ప్రాధాన్యత, రోడ్ సేఫ్టీ, ర్యాష్ రైడింగ్, ఓవర్ స్పీడ్.. తదితర విషయాలు వాళ్లు ప్రాక్టికల్‌గా తెలుసుకుంటారు. నెలలో ఒక వారం కాలేజీ పిల్లలతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నార’ని చెప్పారు రైడర్ అనిల్ కుమార్ రావూరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement