బాచన్‌పల్లి శివారులో చిరుతల సంచారం
Published Sat, Jul 23 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలోని బాచన్‌పల్లి శివారులో చిరుత పులుల సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ శివారులోని కోటప్పకొండ సమీపంలో రెండు రోజుల క్రితం చిరుతలు మేకల మందపై దాడి చేసి 8 మేకలను చంపివేశాయి. గ్రామానికి చెందిన కటికె కిషన్ మేకలను మేపడానికి మందను తోలుకుని గురువారం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అడవిలో మేకల మందను వదిలాడు. ఇదే సమయంలో చిరుతపులి మేకల మందపై దాడి చేసి మేకను నోట కరిచింది. దీన్ని చూసిన మేకల కాపరి దాన్ని తరిమేసేందుకు వెళ్తుండగా మరో చిరుత మేకల మందపైకి వస్తూ కంట పడింది. దీంతో అతను సమీపంలోకి దాక్కున్నానని తెలిపాడు. రెండుచిరుతలు ఒకదాని వెనుక మరొకటి మేకలను నోట కరుచుకుని సమీపంలోని రాతి గుహల్లోకి వెళ్లాయన్నారు. మరుసటి రోజు వెళ్లి చూడగా గుహలో 8 మేకల కళేబరాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని అతను గ్రామస్తులకు తెలిపాడు. దీంతో సమీపంలోని పంట పొలాల రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుతలు దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు.
Advertisement
Advertisement