విద్యాకేంద్రంగా ఓరుగల్లు
-
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
-
మడికొండలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం
మడికొండ :
వరంగల్ నగరాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. మడికొండలో ఏర్పాటుచేసిన ‘ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జిల్లాలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సొంత భవన నిర్మాణానికి త్వరలోనే 14 ఎకరాల భూమి కేటాయిస్తామని, మిగతా ప్రాంతాల్లోని భవనాలను తలదన్నేలా ఇక్కడ అత్యాధునిక వసతులతో భవనం నిర్మించాలన్నారు. అలాగే, హైదరాబాద్ రామంతాపూర్‌లోని పాఠశాల ప్రమాణాలనే ఇక్కడా కొనసాగించాలని సొసైటీ నిర్వాహకులకు కడియం సూచించారు.
త్వరలోనే ఐఐఎం
వరంగల్‌లో ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే, త్వరలోనే సైనిక్ స్కూల్, రాక్‌వెల్ స్కూల్‌తో పాటు ఐఐఎం ఏర్పాటుకానున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎలాంటి అభివృద్ధి అయినా తమ నియోజకవర్గం నుండే జర గడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారన్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సుచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బీ.వీ.పాపారావు, కలెక్టర్ వాకటి కరుణ, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, స్థానిక కార్పొరేటర్ జోరిక రమేష్, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జగదీశ్‌రెడ్డి, వైస్ చైర్మన్ శ్యాంమోహన్, సొసైటీ సభ్యులు రాఘురాం, గుస్తీ జైన్, మర్రి ఆదిత్యరెడ్డి, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఈ.వీ.శ్రీనివాస్, స్థానిక నాయకులు మద్దెల నారాయణస్వామి, బైరి కొంరయ్య, తాడూరి మోహన్, రాజేందర్, రవీందర్, రవి పాల్గొన్నారు.