శిల్పాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గౌరువెంకటరెడ్డి
– కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి
– శిల్పాను కలిసిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
నంద్యాల: బెదిరింపులు, ప్రలోభాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఇది ఉప ఎన్నిక సందర్భంగా తేటతెల్లమవుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి సోమవారం పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మాజీ కౌన్సిలర్‌ను తనవైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి హోదా కూడా దిగజారి ఫోన్‌లో మంతనాలు జరపడం చూస్తే ఆయనలో ఉన్న ఓటమి భయం స్పష్టమవుతుందన్నారు. రూ.1200కోట్ల రోడ్ల విస్తరణ, ఇతర పనులను చేస్తామని ఓటర్లను మభ్యపెడుతున్నారని, 2014ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రజలను మోసం చేశారన్నారు.
హామీలను విస్మరించిన బాబు, మోడీ...
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు ప్రత్యేక హోదానిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చి దగా చేశారన్నారు. రైతురుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారన్నారు. మళ్లీ ఉప ఎన్నికలో కూడా ప్రజలను దగా చేయడానికి వస్తున్నారని అయినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. టీడీపీ పతనం నంద్యాల నుంచే మొదలవుతుందన్నారు. పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను చేశారని కొనియాడారు. ఆయన విజయం తథ్యమన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ విజయం ఖాయం..
చంద్రబాబు నాయుడు తాత్కాలిక ప్రలోభాలతో మభ్యపెట్టి ఓట్లను దండుకోవడానికి యత్నిస్తున్నా కుదిరే పని కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి అన్నారు. తమ అభ్యర్థి శిల్పా, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి కలిసి పని చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారన్నారు. ఈ సమావేశంలో పార్టీ రనేతలు దేశం సుధాకర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డి పాల్గొన్నారు.