సమస్యలపై పోరాడితే బెదిరింపులా..?
నంద్యాల: రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, ప్రజా సమస్యలపై పోరాడితే పీడియాక్ట్‌ను ప్రయోగిస్తానని ప్రభుత్వం బెదిరించడం తగదని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సందర్శించి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి, ఇతర నేతలను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములకు పరిహారం ఇవ్వాలని వామపక్ష నేతలు ఆందోళన నిర్వహిస్తే వారిని అరెస్ట్ చేయించి దారుణమన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులుకు పీఆర్సీ ఇవ్వలేదని గుర్తు చేశారు. రెయిన్‌గన్‌లు, దోమలపై దండయాత్ర వంటి వ్యర్థ కార్యక్రమాలను నిర్వహించి నిధులను వృథా చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు జహీర్‌బాషా, కల్లూరి రామలింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చరణ్‌రెడ్డి, న్యాయవాదులు మాధవరెడ్డి, జాకీర్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.