
దాహం కేకలు
చిలమత్తూరు : మండలంలోని మరసలపల్లి పంచాయతీ కేంద్రంలో గుక్కెడు నీటి కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. మాదిరెడ్డిపల్లి, దోరణాలపల్లి తదితర గ్రామాలకు చెందిన వ్యవసాయ బోర్లను ఆశ్రయించి నీరు తెచ్చుకుంటున్నారు. గ్రామంలో సుమారు 300 ఇళ్లల్లో 1,000 మంది జనాభా నివసిస్తున్నారు. పంచాయతీ వారు గ్రామానికి ఒకబోరు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన బోరుకు మోటారు, పైపులైన్ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. మిగిలిన బోరుకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌కు వ్యవసాయ బోరు తదితర సర్వీసులు ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సమస్య తలెత్తిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో గ్రామంలో నాలుగు రోజులగా చుక్క నీరు సరఫరా కాలేదు. ఫలితంగా చిన్న, పెద్ద తేడా లేకుండా బిందెలతో కిలోమీటర్లు నడిచి పలు గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్టు గ్రామస్తులు వివరించారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామని అ«ధికారులు హామీ ఇవ్వడంతో డీపీ కోసం దిమ్మె నిర్మిస్తే ఇంత వరకు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయలేదని ఆవేదన చెందారు. పాలకులు, అధికారులకు సమస్య తెలియజేస్తే ఒక్కరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి
అధికారులు స్పందించి గ్రామానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌కు దిమ్మె ఏర్పాటు చేశాం. ఇంతవరకు అధికారులు స్పందించకపోవంతో సమస్య తలెత్తింది.
- లక్ష్మీనారాయణ, మరసలపల్లి
శాశ్వత పరిష్కారం చూపాలి
నీరు, ట్రాన్స్‌ఫార్మర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. నాలుగు రోజులుగా నీటి సమస్యతో పలు గ్రామాలు, వ్యవసాయ బోర్లకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం.
- అంజి, మరసలపల్లి