అందని నీరు.. అన్నదాత కన్నీరు..
అందని నీరు.. అన్నదాత కన్నీరు..
Published Sat, Mar 25 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
-ఏలేరు ఆయకట్టులో 500 ఎకరాల్లో ఎండిన రబీ పంట
-వట్టిపోయిన పాలకులు, అధికారుల వాగ్దానాలు
-ఎకరాకూ రూ.30 వేల వరకూ నష్టం
-పశువులను మేపుకొంటున్న రైతులు
పిఠాపురం : ‘ఏలేరు రైతుల కన్నీరు తుడుస్తాం. కోట్లు కుమ్మరిస్తున్నాం. ఒక్క ఎకరం కూడా ఎండనివ్వం. రబీకి పుష్కలంగా సాగునీరు అందిస్తున్నాం’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పాలకులు చివరికి ఆ ఆయకట్టు రైతులను నిలువునా ముంచేశారు. ప్రతి ఎకరాకూ వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు నీరందక కళ్ల ముందే ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు, పీబీసీ పరిధిలో సుమారు 14 వేల హెక్టార్లలో రబీ సాగు చేపట్టారు. ఏలేరు ఆయకట్టులో పిఠాపురం సమీపంలో ఉన్న సుమారు 500 ఎకరాల రబీ పంట గత 40 రోజులుగా (నాలుగు తడులు) సాగునీరందక ఎండిపోయింది. ఎకరానికి సుమారు రూ.24 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, కనీసం పచ్చగడ్డిగా కూడా పనికి రాకుండా పంటలు నాశనమయ్యాయని రైతులు వాపోతున్నారు. పంటను కాపాడుకోవడానికి అనేక విధాలా ప్రయత్నించామని, నీటిపారుదల శాఖాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కన్నెత్తి చూడలేదని, ఇంజన్లతో నీరు తోడుకుందామన్నా కాలువలు మూసుకుపోయి చుక్కనీరు కూడా లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. చేలలో పశువులను మేపుకొంటున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. సాగునీరు ఇస్తామని ప్రగల్భాలు పలికిన ఏలేరు నీటిసంఘం నాయకులు అధికారపార్టీ నేతల వద్దకు వెళ్లి నిలదీసినా నోరుమెదపడం లేదని, కనీసం వచ్చి ఎండిన పంటలను చూసిన పాపాన పోలేదని నిరసిస్తున్నారు. ఎండిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement