
సంక్షేమ పథకాల అమలులో మనమే నంబర్‌వన్
హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని.. ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బొంగ్లూర్ గేటు సమీపంలో ఓ పంక్షన్ హాల్ ప్రారంభ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ,ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ కుల,మత, వర్గ విభేదాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
అందరి అండదండలు, ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా బంగారు తెలంగాణ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజలకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వినియోగదారులకు ఇబ్బందులు కల్గించకుండా వసతులు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు డబ్బీకార్ శ్రీనివాస్, కొత్త ఆశోక్‌గౌడ్, పోరెడ్డి నర్సింహారెడ్డి, మంగళ్‌పల్లి సర్పంచ్ అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.