ఈ చైర్మన్‌ మాకొద్దు! | we donot want this chairman | Sakshi
Sakshi News home page

ఈ చైర్మన్‌ మాకొద్దు!

Published Wed, Jul 12 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

ఈ చైర్మన్‌ మాకొద్దు!

ఈ చైర్మన్‌ మాకొద్దు!

– ఏకమవుతున్న జెడ్పీటీసీ సభ్యులు
– నేరుగా లోకేష్‌ ముందుకు పంచాయితీ
– పాణ్యంలోని ఓ హోటల్‌లో 25 మంది జెడ్పీటీసీల సమావేశం 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను తొలగించాలని పలువురు అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఏకమవుతున్నారు. ఏకంగా 25 మంది జెడ్పీటీసీలు ‘ఈ చైర్మన్‌ మాకొద్దంటూ’ పాణ్యంలో రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమయ్యింది. నేరుగా మంత్రి లోకేష్‌ ఎదుటే పంచాయితీ చేసి.. చైర్మన్‌ను తొలగించాలని కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నెల 15న జరిగే జిల్లా పరిషత్‌  సర్వసభ్య సమావేశాన్ని కూడా బాయ్‌కాట్‌ చేసి నిరసన తెలపాలని ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చైర్మన్‌ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఫోన్‌ కూడా లిఫ్టు చేయడం లేదని ఈ సందర్భంగా పలువురు వాపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నేరుగా లోకేష్‌ సమక్షంలో పంచాయితీ తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
 
అన్నింటిలోనూ అవమానాలే!
జెడ్పీ చైర్మన్‌ తమను అన్నింటిలోనూ అవమానిస్తున్నారని ఈ సందర్భంగా జెడ్పీటీసీలు వాపోయారు.  తాము ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని, ఒకవేళ బిజీగా ఉంటే తర్వాత కూడా సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. నీరు–చెట్టు పనుల అప్పగింతలో తమ ప్రమేయం లేకుండా వ్యవహారాలు నడుపుతున్నారని ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీలు విమర్శించినట్టు తెలుస్తోంది. హడావుడిగా జెడ్పీ గెస్ట్‌హౌస్‌ను కూల్చివేసి.. మహిళా సభ్యులు కూడా విశ్రాంతి తీసుకునేందుకు వీలు లేకుండా చేశారని మండిపడ్డారు. జెడ్పీ ఆవరణలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారనే కనీస సెక్యూరిటీ లేకుండా పోయిందని, వీటన్నింటికీ కారణం చైర్మన్‌ నిర్లక్ష్యమేనని అభిప్రాయపడ్డారు.
 
ఇదే వ్యవహారంపై నేరుగా లోకేష్‌ను కలిసి అనంతపురం జిల్లా తరహాలో ఇక్కడ కూడా చైర్మన్‌ను మార్చాలని కోరాలని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు నడిపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో జెడ్పీ చైర్మన్‌ మార్పు తప్పదని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, తనకు తానుగా దిగితే తప్ప తనను ఎవ్వరూ దించలేరని, అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల వరకూ ఆగాల్సిందేనని జెడ్పీ చైర్మన్‌ అనుచరులు పేర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement