
మీకు న్యాయం చేస్తాం..
నయీం బాధితులకు ఎస్పీ హామీ
భువనగిరి : నయీం, అతడి అనుచరుల బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో టీచర్స్ కాలనీ పక్కన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి నగర్ ప్లాట్ల ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 150 మందితో ఎస్పీ రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా నయీం అనుచరుడు షేక్ షకీల్ మరికొంత మంది తమను కత్తులు, తుపాకులు చూపించి బెదిరించి ప్లాట్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, తమ డాక్యుమెంట్లు లాక్కున్నారని వివరించారు. తమ భూములను కబ్జా చేసుకున్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ స్థలం అంతా బాయ్‌సాబ్‌దని చెప్పి బెదిరించారని వివరించారు. తమకు న్యాయం చేయాలని బాధితుల సంఘం కార్యదర్శి పులికంటి నరేష్ ఎస్పీని వేడుకున్నాడు. కాగా, బాధితులు తెలిపిన విషయాలను సమగ్రంగా విన్న ఎస్పీ ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం అందరికీ తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్ ఎం.శంకర్‌గౌడ్, రూరల్ సీఐ అర్జునయ్య ఉన్నారు.