ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
Published Sun, Oct 2 2016 12:17 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM
భీమవరం : పెద్దఎత్తున కాలుష్యాన్ని వెదజల్లే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ పి.మధు స్పష్టం చేశారు. శనివారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించి పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి భరోసా ఇవ్వడానికి వచ్చిన తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ సందర్భంలో పోలీసులు నీచాతినీచంగా వ్యవరించారని, దుర్మార్గంగా తనపై దాడి చేశారని మధు వాపోయారు. తమను దొంగలు, రౌడీలు మాదిరిగా ఈడ్చుకువెళ్లారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వాపార్క్ నిలుపుదల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆదివారం ధర్నాలు నిర్వహిస్తామని, తద్వారా ముఖ్యమంత్రికి హెచ్చరికలు పంపుతామని అన్నారు. ఈనెల 6వ తేదీన భీమవరంలో యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యంపై సదస్సు నిర్వహించనున్నామని, యనమదుర్రు కాలుష్యానికి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీయే కారణమని ధ్వజమెత్తారు. తణుకు పట్టణంలోని కొన్ని ఫ్యాక్టరీల కారణంగా కాలుష్యం పెరిగిపోయిందన్నారు. ఈనెల 8వ తేదీన ఆక్వా ఫుడ్ పార్క్‌పై సదస్సు నిర్వహిస్తామని, దీని నిర్మాణాన్ని నిలుపుదల చేసేవరకూ అంచలంచెలుగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, వైఎస్సార్ సీపీ నాయకులు గాదిరాజు తాతరాజు, కోడే యుగంధర్, మునిసిపల్ కౌన్సిలర్ భూసారపు సాయిసత్యనారాయణ, సీపీఎం నాయకులు బి సత్యనారాయణ, బీవీ వర్మ, వాసుదేవరావు ఉన్నారు.
Advertisement