న్యాయం కావాలి
♦ పోలవరం నిర్వాసితుల వేడుకోలు
♦ మూడేళ్ల నిబంధనతో అవస్థలు
♦ వివాహిత మహిళల పేర్లు జాబితా నుంచి తొలగింపు
♦ అక్రమాలు జరిగాయని యువతుల ఆవేదన
పోలవరం: కొత్త భూసేకరణ చట్టంలో ఉన్న మూడేళ్ల స్థానికత నిబంధన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో వివాహమైన యువతుల పాలిట శాపంగా మారింది. పుట్టినప్పటి నుంచి గ్రామంలో ఉన్నా, 2006 సర్వేలో పేర్లు నమోదు అయినా, వివాహమైన యువతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ వర్తింప చేయటం లేదు. ఇటీవల రెవెన్యూ అధికారులు ముంపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆర్‌అండ్‌ఆర్ అబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. జాబితాలో లేని వారి పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ గ్రామసభల సమయానికి జాబితాలో నమోదు చేసి ఉన్న వివాహిత యువతుల పేర్లు మాత్రం జాబితాల నుంచి తొలగించారు. వీరంతా ప్యాకేజ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు.
గ్రామసభల నాటికి మూడేళ్ల ముందు నుంచి గ్రామంలో ఉండాలనేది నిబంధన అని, వివాహమైనందున వారు గ్రామంలో ఉండరు కాబట్టి, వారి పేర్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు. 2006 నుంచి ప్యాకేజ్ కోసం ఎదురు చూశామని, ఇటీవలే వివాహం చేశామని, తీరా వివాహమైనందున ఆర్‌అండ్‌ఆర్ జాబితా నుంచి తమ పిల్లల పేర్లు తొలగించారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1200 మంది 18యేళ్లు పైబడిన యువతులు ఉండగా, వీరిలో దాదాపు 200 మంది యువతులకు గత రెండు లేదా మూడేళ్లలోపు వివాహాలయ్యాయి. వీరంతా ఈ నిబంధన కారణంగా ప్యాకేజ్ నష్టపోతున్నారు. గ్రామ సభల సమయంలో తమకు ప్యాకేజ్ వస్తుందని అధికారులు చెప్పారని, ఇపుడు పేర్లు తొలగించారని వివాహిత యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహమైనప్పటికీ కొందరి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయని వారు ప్రశ్నిస్తున్నారు.
కొందరి పేర్లు ఎలా వచ్చాయి...
నాకు వివాహమైంది. గ్రామసభల్లో ప్యాకేజ్ జాబితాలో నాపేరు చదివి వినిపించారు. ఆ తరువాత అధికారులు నాపేరు జాబితా నుంచి తొలగించారు.వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. వివాహమైన కొందరి పేర్లు ప్యాకేజ్ జాబితాలో ఎలా వచ్చాయి.
మూలెం రాజకుమారి, మాదాపురం, పోలవరం మండలం
నాపేరు తొలగించారు...
మాది పైడాకులమామిడి గ్రామం. నాకు వివాహమైంది. గ్రామసభల్లో నాపేరు చదివి వినిపించారు. ఆ తరువాత జాబితా నుంచి నాపేరు తొలగించారు. వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. ఇది అన్యాయం. ఇక్కడ పుట్టి, పెరిగిన వారికి ప్యాకేజ్ లేకుండా చేస్తున్నారు.
కొవ్వాసు బుచ్చమ్మ, పైడాకులమామిడి, పోలవరం మండలం