పుష్కరాలకు మంచి ఆతిథ్యాన్నిద్దాం
విజయవాడ(వన్‌టౌన్) :
కృష్ణా పుష్కరాలకు మంచి ఆతిథ్యాన్నిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆధునికీకరించిన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. సుమారు ఎనిమిది కోట్లతో కళాక్షేత్రం ప్రాంగణాన్ని ప్రభుత్వం ఆధునికీకరించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ పన్నెండు రోజులూ పుష్కరాలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పుష్కర స్నానం చేసేందుకు నగరానికి వచ్చే భక్తులకు ప్రజలందరూ ఆత్మీయ స్వాగతం పలకాలన్నారు. ఇటువంటి వేదికలు మరిన్ని రావాల్సి ఉందన్నారు. నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించేందుకు ఒక మంచి వేదిక అన్నారు. శుక్రవారం నుంచి పన్నెండు రోజుల పాటు రాష్ట్రానికి దశ, దిశ నిరే్ధశం చేసే 12 అంశాలపై చర్చా గోషు్ఠలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ధరలు పెంచితే చర్యలు
పుష్కరాలు అవకాశంగా తీసుకొని కొంత మంది వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హుదూద్ తుఫాన్ సందర్భంగా విశాఖ నగరంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించగా దానిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. విజయవాడ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీ నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని, నగర మేయర్ కోనేరు శ్రీధర్ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియాన్ పాల్గొన్నారు.