ప్రభుత్వ సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి మార్చండని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం లోని ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం నిర్వహించిన 70వ స్వాతంత్య్రదినం వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేసి మాట్లాడారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అదనపు భవనాలకు రూ. 500 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. రూ. 21 కోట్ల నాబార్డు నిధులతో సత్తెనపల్లికి ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫైల్ ప్రాసెస్‌లో ఉందని, ఈ వారంలో క్లియర్ అవుతుందన్నారు.ఈ నిధులతో నిర్మించే భవనం ఫైవ్‌స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా భవనం తీసుకొని ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అంబేడ్కర్ ఓవర్‌సీస్ పథకం కింద విదేశాలలో ఉచితంగా విద్యనభ్యసించేందుకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 200 మంది విద్యార్థులను అమెరికా వంటి దేశాలకు పంపామన్నారు.