- ముందుకు సాగని హెచ్చెల్సీ ఆధునీకీకరణ పనులు
నెల.. రెండు నెలలు కాదు.. ఏకంగా 96 నెలలకు పైగా తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునీకీకరణ పనులు సాగుతూ.. ఉన్నాయి! 2009లో జిల్లా సరిహద్తులోని 105వ కిలోమీటరు నుంచి 189వ కిలోమీటరు వరకూ ఆధునీకీకరణ పనుల కోసం రూ. 475 కోట్లను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు అనుకున్న స్థాయిలో జరిగి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఆధునీకీకరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో పంటలకు సాగునీరు అందడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది కూడా పనులు పూర్తి అవుతాయనే నమ్మకం లేదు.
హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు 32 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం 18 టీఎంసీలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రధాన కాలువ వెడల్పు లేకపోవడంతో.. లైనింగ్ దెబ్బతినడం వల్ల తరచూ గండ్లు పడుతూ జిల్లాకు సాగునీరు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. దీంతో హెచ్చెల్సీ ఆధునీకీకరణకు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం పనులు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రధాన కాలువను వెడల్పు చేయడంతో పాటు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది.
మోపిడి వద్ద నత్తనడకన
ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామం వద్ద డీప్ కట్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో కాలువ వెడల్పు 15 మీటర్లు ఉంది. ఇందులో 2,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అవకాశం ఉంది. కాలువ సామర్థ్యాన్ని 15 నుంచి 25 మీటర్లుకు పెంచడం ద్వారా 4,500 కూసెక్కుల నీటి ప్రవాహానికి అనుకూలం చేయాలని అధికారులు భావించారు. ఆ మేరకు చర్యలూ చేపట్టారు. ప్రస్తుతం మోపిడి వద్ద 172 కిలోమీటరు నుంచి 188 కిలోమీటరు వరకు పనులు సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో డీప్ కట్ వద్ద పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించేందుకు డిటనేటర్లను ఉపయోగించాల్సి ఉంది. ఈ పనులను పూర్తి చేయకుండానే లైనింగ్ పనులు చేపట్టారు. హెచ్చెల్సీలో షట్టర్లు సైతం తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. కాలువ గట్లు ఎక్కడపడితే అక్కడ కోతకు గురవుతున్నాయి.
పనులు వేగవంతం చేస్తాం.. : రామసంజప్ప, డీఈ, హెచ్చెల్సీ
ఆరో ప్యాకేజీ పనులు వేగవంతం చేయనున్నాం. ప్రస్తుతం లైనింగ్, సూపర్ ప్యాసెస్ పనులు జరుగుతున్నాయి. 188వ కిలోమీటరు వద్ద బ్లాస్టింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తాం. నిధుల సమస్య లేదు.