అనంతపురం సెంట్రల్ : స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి హెచ్చెల్సీలో గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు .... కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన ముత్యాలప్ప కుమారుడు అనిల్‌బాబు(13) అనంతపురంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ కలెక్టరేట్‌కు సమీపంలోని రాజేంద్ర మునిసిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తోటి స్నేహితులు మూర్తి, అనిల్‌తో కలిసి గుత్తిరోడ్డు సమీపాన గల హెచ్చెల్సీలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. కాసేపు ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపారు. అనిల్‌బాబుకు ఈతకొట్టడంలో అనుభవం ఉందనే ధీమాతో కాలువ మధ్యలోకి దూకాడు. నీటి ప్రవాహ వేగానికి బయటకు రావడానికి కష్టమైందో.. లేక లోపల రాళ్లు ఏవైనా బలంగా తగిలాయో తెలియదు కానీ అనిల్‌బాబు పైకి రాలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు స్థానికులతో మొరపెట్టుకున్నారు. దీంతో వారు త్రీటౌన్ సీఐ గోరంట్లమాధవ్, ఎస్‌ఐ రెడ్డప్పకు సమాచారం అందించారు.
ఎంత గాలించినా కానరాని జాడ
సీఐ మాధవ్, ఎస్‌ఐ రెడ్డప్ప గజ ఈతగాళ్లతో కలిసి హెచ్చెల్సీవద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో సీఐ మాధవ్ నేరుగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. పొద్దుపోయేంత వరకూ గాలించినా విద్యార్థి ఆచూకి తెలియరాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.
మరో యువకుడు..
బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రం మండల పరి«ధిలోని గాయిత్రినగర్‌కు చెందిన ఓ యువకుడు హెచ్చెల్సీలో గల్లంతైన సంఘటన సోమవారం చోటు చే సుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గాయిత్రినగర్‌కు చెందిన వడ్డె ఎరుకులయ్య(35) సోమవారం మద్యం సేవించి హమాలీ కాలనీ వద్ద ఉన్న పీనుగుల బ్రిడ్జి వద్ద కాలువలో స్నానం చేయడానికి వచ్చాడన్నారు. అక్కడ కాలువ వద్ద అందరూ చూస్తుండగానే కాలువలో స్నానం చేయడానికి దిగారు. నీరు వేగంగా వస్తుండటంతో నీటిలో కొట్టుకపోయాడన్నారు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎరుకులయ్య ఆచూకీ కనిపించ లేదు.