
హెచ్‌ఎల్‌సీలో బాలుడి గల్లంతు
గార్లదిన్నె : గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మిదేవి, నరసింహులు దంపతుల కుమారుడు రాము(16) హెచ్‌ఎల్‌సీలో పడి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... తల్లిదండ్రులతో కలసి హెచ్‌ఎల్‌సీ కాలువలో దుస్తులు ఉతికేందుకు బుధవారం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అవతలి వైపు గట్టునున్న పశువుల కాపర్లు గమనించి గట్టిగా కేకలు వేయడంతో రాము తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. అందరూ కలసి రాము కోసం గాలించారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ఉన్న ఏకైక కుమారుడు ఇలా కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని అందరినీ వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు వెంటనే ఈతగాళ్లతో కాలువ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడిని కనుగొనలేకపోయారు.