సాక్షి, అనంతపురం, కర్నూలు: తుంగభద్ర జలాశయానికి రానున్న రెండురోజుల్లో లక్ష క్యూసెక్కులు చొప్పున వరద ఉధృతి వచ్చే అవకాశముందని తుంగభద్రబోర్డు అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. గురువారం ఉదయం లెక్కల ప్రకారం తుంగభద్ర జలాశయానికి 39,142 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయంలో 100.855 టీఎంసీలు నీటిమట్టం కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా 38,890 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఎగువున వర్షాలు అధికం అవుతున్న నేపథ్యంలో రెండురోజులోల 50 వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరగవచ్చునని బోర్డు అధికారులు తెలిపారు.
ప్రత్యేక చర్యలు తీసుకోండి
తుంగభద్ర నదికి వరద హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని బొమ్మనహాల్, కణేకల్, డీ.హీరేహల్, ఉరవకొండ మండలాల తహసీల్దార్‌లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా మండలాల్లోని గ్రామాల్లో దండోరాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు రావడం వలన తుంగభద్ర జలాశయం తీవ్ర వర్షాభావాన్ని చవి చూసింది. ఆగష్టులో కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండింది. ఆగష్టు నుంచి సెప్టెంబర్ వరకూ జలాశయానికి వరద వస్తుండటంతో గత నెల రోజులుగా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. తాజాగా మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. గత ఆగష్టులో దాదాపు 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేశారు. తాజాగా లక్ష క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేస్తుండడంతో ఆ నీటిని కూడా దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది.
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో హెచ్చెల్సీకి ప్రమాదం పొంచి ఉందని, నీటిపారుదల శాఖ, రెవెన్యూ , పోలీసులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బొమ్మనహాళ్ తహసీల్దార్ అనీల్‌కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన రెవెన్యూ , ఇరిగేషన్ సిబ్బందితో కలిసి నీటి మట్టాన్ని పరిశీలించారు.
సరిహద్దులో హెచ్చెల్సీ కాలువ నీటి మట్టాన్ని పరిశీలిస్తున్న అధికారులు
హెచ్చెల్సీ ప్రధాన కాలువకు కూడా నీటి మట్టాన్ని పెంచారని ఎక్కడైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది కాలువ పొడవునా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుంగభద్ర ప్రధాన కాలువకు ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర గేట్ల ద్వారా నీటిని వేదావతి హగరికి మళ్లించే అవకాశం ఉన్నందున హగరి పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దుల్లోని హెచ్చెల్సీకి 1700 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment