పుష్కరాల రోజుల్లో సీఎం రూటు ఎటో?
Published Sun, Jul 24 2016 9:18 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : పుష్కరాలు జరిగే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే మార్గంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉంటున్న విషయం విదితమే. ఆగస్టు 12వ తేదీ నుంచి పుష్కరాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. పుష్కరాల రోజుల్లో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ, సీతానగరం ప్రాంతంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సీఎం నివాసం నుంచి ప్రస్తుతం ఆయన ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం అయితే లక్షలాది మంది భక్తుల మధ్య సీఎం ప్రయాణం చేయడం ఆయన భద్రతకే ప్రమాదమని పలువురు అధికారులు భావిస్తున్నారు. మరి తాడేపల్లి బైపాస్ రోడ్డుకు వెళ్లాలంటే ఉన్న రెండు మార్గాలు కూడా పూర్తి కాలేదు. మొదట అధికారులు పుష్కరాలు ప్రారంభం అయితే ఉండవల్లి సీఎం నివాసం వద్ద నుంచి ఉండవల్లి, ఉండవల్లి సెంటర్, స్క్రూబ్రిడ్జి, ఎన్టీఆర్ కట్ట మీదుగా బైపాస్ రోడ్డుకు వెళ్లి విజయవాడ క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ కరకట్ట విస్తరణ పనులు ఆఘమేఘాలపై చేపట్టారు. పనులు చేస్తుండగానే సీఎం నివాసం నుంచి క్యాంపు ఆఫీసు వరకు తాడేపల్లిలోని సేఫ్టీ హౌస్, ఓ కార్పొరేట్ ఆసుపత్రి వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎన్టీఆర్ కరకట్ట ఎర్త్ వర్క్‌లే జరుగుతున్నాయి. దాదాపుగా రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రహదారి నిర్మాణం మరో 18 రోజుల్లో పూర్తి అవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క రోజు వర్షం కురిసినా, నాలుగైదు రోజుల పనులకు అంతరాయం కలుగుతోంది. ఇదిలాఉంటే తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి కొత్తూరు మీదుగా పశువుల ఆసుపత్రి బ్రిడ్జి దాటి బైపాస్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంది. ఈ రహదారిలో తాడేపల్లి, కష్ణా కెనాల్, కొలనుకొండ ప్యారీ కంపెనీలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ నుంచి భక్తులు ఈ ప్రాంతం గుండానే ప్రయాణం సాగించాల్సి ఉంది. అటు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద, ఇటు సీతానగరం వద్ద, కొత్తూరులో భక్తులను సీఎం వచ్చే సమయంలో ఆపితే వేలాది మంది భక్తులకు అసౌకర్యం ఏర్పడుతుంది. ప్రకాశం బ్యారేజి దగ్గర నుంచి విజయవాడ వెళ్లే సమయంలో అర్ధగంట ట్రాఫిక్ ఆపితేనే ప్రస్తుతం వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడుతున్నారు. పుష్కరాల సమయంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపితే, తోపులాట జరిగి రాజమండ్రి లాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే రానున్న పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూటు ఎటో అర్థం కాక భద్రత సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు.
Advertisement