రికార్డుల్లో మాయమవుతున్న రాజధాని రైతుల భూములు
ప్రశ్నించిన రైతు రాంబాబుపై కేసు..
శుక్రవారం రాత్రి నుంచి కానరాని రాంబాబు
భూ కబ్జాలపై కరపత్రాల కలకలం
రాజధాని రైతుల్లో ఆందోళన.. అంతర్మథనం
తుళ్లూరు : రాజధానిలో మరో భూమాయ కలకలం రేపింది. రికార్డుల్లో రైతుల భూములు మూడు నుంచి పది సెంట్ల వరకు మాయమవుతున్నాయి. ఈ విషయంపై ప్రశ్నించిన వ్యక్తులను బెదిరిస్తున్నారు. రికార్డులో భూములు తక్కువగా ఉండటం.. ప్రశ్నించిన ఓ వ్యక్తి అదృశ్యమవడం... కొందరు అధికార పార్టీ నేతల భూదందాపై గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేయడం... తదితర అంశాలు ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
వీటన్నింటిని పరిశీలించిన రైతులు ఎవరు ఏమాయ చేస్తున్నారో.. అని ఆందోళనకు గురవుతున్నారు. భూమిలిచ్చి తప్పు చేశామా.. అని అంతర్మథనానికి గురవుతున్నారు. రాజధాని నిర్మాణంలో తుళ్లూరు మండలం కీలకభూమిక పోషిస్తోంది. ఉద్దండరాయునిపాలెంలోనే రాజధానికి శంకుస్థాపన చేశారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి కేంద్ర బిందువు. అటువంటి మండలంలో రైతులకు రక్షణ కరువైంది. భూములు ఇచ్చిన వారిని పాలకులు, అధికారులు కలిసి మోసం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే వేధిస్తున్నారు.
రాంబాబు ఎక్కడ..
తన భూమి రెవెన్యూ రికార్డుల్లో తగ్గించి ఉండటంపై అనంతవరం గ్రామానికి చెందిన రాంబాబు సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లి సమస్యను తెలియజేయగా... అధికారులు అవమానించి పంపించారు. అవమానభారాన్ని తట్టుకోలేక రాంబాబు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. రైతుకు న్యాయం చేయాల్సిన అధికారులు తిరిగి అతనిపైనే కేసు పెట్టారు.
అంతటితో వదలని అధికారులు అరెస్టు చేయించారు. శుక్రవారం రాత్రి అరెస్టయిన రాంబాబు శనివారం రాత్రి వరకు కనిపించలేదు. అతనికి కుటుంబీకులు కూడా కనిపించకపోవటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అనంతవరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతుల భూముల్లో కొంత రికార్డుల్లో గల్లంతయ్యాయి.
మూడు సెంట్లు కనిపించలేదని అధికారులను అడిగిన పాపానికి రాంబాబుని చిత్రహింసలకు గురి చేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రికార్డుల్లో కనిపించని తమ భూముల విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని చర్చించుకుంటున్నారు. రాంబాబు ఎక్కడ ఉన్నాడనే విషయంపైనా ఉత్కంఠత నెలకొంది.
అనంతవరంలో కరపత్రాల పంపిణీ
ప్రభుత్వ రికార్డుల్లో భూములు ఓ పక్క మాయమవుతున్నాయి. మరో పక్క గ్రామంలో సుమారు 19 ఎకరాలు కబ్జాకు గురైందని అజ్ఞాత వ్యక్తి శనివారం అనంతవరం గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అందులో గ్రామానికి చెందిన కొందరి పేర్లను ప్రస్తావించారు. టీడీపీ నాయకులు, అధికారులపై విమర్శలు చేశారు.
అదే విధంగా దొంగతనాలు చేసే ఓ వ్యక్తి నాలుగంతస్తుల భవంతి కట్టారని ఆ లేఖలో ప్రశ్నించారు. భూ కబ్జాలు, నయింలా బెదిరింపులు చేస్తున్న విషయాలను ప్రస్తావించారు. మొత్తంగా అనంతవరం గ్రామంలో ఈ మూడు మూడు ఘటనలపై తీవ్ర చర్చనీయాంశమైంది.