కడప అగ్రికల్చర్ : ‘రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం.. ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతుల కోసం ఏ ప్రభుత్వం మేలు చేయని విధంగా చేస్తున్నాం’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చిన ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. రైతులకు న్యాయంగా రావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా తప్పకుండా మే నెల లోపల ఇస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని.. జిల్లాలోని పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లె, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి ప్రాంతాల్లో చీనీ, మామిడి తోటల పరిశీలనకు వచ్చిన సందర్భంలో మీడియా ఎదుట ప్రకటించారు.
అయితే మంత్రి భరోసా రైతులకు ఏ మాత్రం ధైర్యమివ్వడం లేదు. వ్యవసాయం మాటెత్తితే రైతులు హడలిపోతున్నారు. 2014, 2015 సంవత్సరంలో వ్యవసాయ పంటలు నష్టపోగా ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, 2013 నుంచి 2017 వరకు ఉద్యాన పంటలకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందనే విషయాన్ని ప్రభుత్వం మరచిపోయినట్లుందని రైతులు మండిపడుతున్నారు. కేవలం వ్యవసాయ పంటలకు సంబంధించిన 2016 ఇన్‌పుట్ సబ్సిడీ మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామ సభలు పెట్టి ఇన్‌పుట్ సబ్సిడీ పత్రాలు ఇచ్చారని, మరి గతంలో బకాయి ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ, గత ఏడాది బీమా రావాల్సి ఉన్నా ఎందుకు తెప్పించడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
2014–2015 వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీ మరచి పోవాల్సిందేనా..
2014లో వర్షాభావం వల్ల జిల్లాలో వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కంది, మినుము, పెసరతో పాటు పలు రకాల పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఎండిన పంటలను పరిశీలించి నష్ట నివేదికలను తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ఆ ఏడాదికి సంబంధించి 2,580 మంది రైతులు నష్టపోగా రూ.1.80 కోట్ల పంట చేతికి రాకుండా పోయింది.
- అలాగే 2015లో వర్షాభావం, అకాల వర్షాల కారణంగా వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు, పత్తి, పెసర, మినుము, కంది, మొక్కజొన్న, కొర్ర, సోయాబీన్, నువ్వులు, చెరకు, ఆముదం, బుడ్డశనగ, ఉలవ పంటలు దెబ్బతిన్నాయి. దీనికిగాను 1100 మంది రైతులు పంటను కోల్పోయారు. దీనిపై ప్రభుత్వానికి పంపిన నివేదికలో రూ.1.20 కోట్ల పెట్టుబడులు నేలపాలయ్యాయని పేర్కొన్నారు.
2013 నుంచి ఇప్పటి వరకు ఉద్యాన ఇన్‌పుట్ ఎప్పుడిస్తారో..
జిల్లాలో మెజార్టీ రైతులు ఉద్యాన పంటలను సాగు చేసి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈదురు గాలులు, అకాల వర్షాలు వచ్చాయంటే ఆయా రైతుల్లో వణుకు మొదలవుతుంది. కారణమేమంటే చేతికొచ్చిన పంట ఎప్పుడు నేలవాలుతుందోనని రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. మూడు సంవత్సరాలుగా పలు కారణాల వల్ల చేతికందాల్సిన కోట్లాది రూపాయల పంటలను రైతులు కోల్పోయారు.
► 2013లో అకాల వర్షాల వల్ల 1279 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి, చీనీ, నిమ్మ, ఆకు తోటలు, కూరగాయ తోటలు దెబ్బతినగా 2495 మంది బాధిత రైతులు నష్టపోయారు. ఈ నష్టం విలువ రూ. 2.96 కోట్లుగా అధికారులు తేల్చారు.
► 2014లో అతివృష్టి వల్ల జిల్లాలో అరటి, బొప్పాయి, చీనీ, మామిడి, పూలతోటలు, ఆకుతోటలు, కూరగాయ తోటలు కలిపి 927.72 హెక్టార్లలో నేల వాలాయి. అప్పట్లో అధికారులు క్షేత్రస్థాయిలో 2091 మంది బాధిత రైతులను గుర్తించి మొత్తం రూ.2.19 కోట్లు నష్టపోయినట్లు నివేదికలు తయారు చేసి పంపారు. ఈ ఏడాదిలోనే వర్షాభావం వల్ల 285.54 హెక్టార్లలో పంటలు ఎండిపోయి 326 మంది బాధిత రైతులు నష్టపోగా రూ.42.78 లక్షల పంట చేతికి రాకుండా పోయింది.
► 2016లోను అతివృష్టి వల్ల 1173.49 హెక్టార్లలో అరటి, బొప్పాయి, చీనీ, నిమ్మ, సపోట, ఆకుతోటలు, పూలతోటలు, కూరగాయ తోటలు నీట మునిగాయి. దీని కారణంగా 2684 మంది రైతులు నష్టపోయారు. దీనిపై క్షేత్రస్థాయిలో నష్ట నివేదికలు తయారు చేయగా అందులో రూ.2.88 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు.
► 2017(ఈ ఏడాది) ఈదురుగాలుల వల్ల అరటి, బొప్పాయి, మామిడిì , చీనీ, నిమ్మ, ఆకుతోటలు 534 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దీనివల్ల 8832 మంది రైతులు తీవ్రంగా నష్టపోగా, చేతికొచ్చిన పంట వల్ల రూ.1.48 కోట్లు ఆదాయం కోల్పోయినట్లు అధికారులు నివేదికలు పంపారు.
అతిగతీలేని పంటల బీమా
జిల్లాలో 2012లో బుడ్డశనగ సాగు చేసిన రైతుల్లో 23 వేల మందికి రూ.53 కోట్లు, 2016 ఖరీఫ్‌లో ప్రధాని ఫసల్ బీమా కింద 23,225 హెక్టార్లలో సాగు చేసిన పంటలకు 26,404 మంది రైతులు రూ.16.71 కోట్లు ప్రీమియం చెల్లించారు. అలాగే వాతావరణ బీమా కింద 21,441 హెక్టార్లలో సాగు చేసిన పంటలకు 23,450 మంది రైతులు రూ.7.18 కోట్లు ప్రీమియం చెల్లించారు. ఉద్యాన పంటలకు 314 మంది రైతులు రూ.80,987 ప్రీమియం కంపెనీకి చెల్లించారు. రబీలో బుడ్డశనగ పంట 75,779.22 హెక్టార్లలో సాగు చేసిన పంటకు 55,417 మంది రైతులు రూ.6.19 కోట్ల ప్రీమియం చెల్లించినా ఇప్పటికీ అతీగతీలేదు. ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, చివరకు చేతులెత్తేస్తుందేమోననే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు.