వ్యవస్థను సర్వనాశనం చేసిన బాబు
– మల్లేల బహిరంగ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ధ్వజం
సాక్షి, కడప/పులివెందుల/తొండూరు : రైతులు.. డ్వాక్రా మహిళలు.. నిరుద్యోగులు.. ఉద్యోగులు ఇలా అందరూ మోసానికి గురయ్యారు... ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.. కనీసం కష్టాలలో ఉన్న వారికి భరోసా కూడా కల్పించలేదు.. బాబు సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది... గెలిచిన ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి.. పట్టుమని పది ఓట్లు కూడా రాని ఓడిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి వేదికలపై కూర్చోబెట్టడం.. ఏ అర్హతలేని వారిని జన్మభూమి కమిటీలో సభ్యులంటూ పథకాల్లో పెత్తనం చలాయించేలా జీవో తీసుకొచ్చి వ్యవస్థలనే చంద్రబాబు సర్కార్ సర్వనాశనం చేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం తొండూరు మండలం మల్లేల గ్రామంలో గడప గడపకు వైఎస్‌ఆర్ ముగింపు కార్యక్రమం సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పల్లెసీమల్లో గడపగడపకు వైఎస్‌ఆర్‌పట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిదని.. ప్రారంభంనుంచి అయిపోయేవరకు ఒక్క పండుగలా ప్రతి ఇంటినుంచి వచ్చి ప్రజలు పాల్గొంటుండటం మరిచిపోలేని అనుభూతి అని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత. వైఎస్‌ఆర్‌సీపీపై ఉన్న అభిమానం అందరిని కదిలేలా చేస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున కదిలి వస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పింఛన్ల తొలగింపుపై లోకాయుక్త కోర్టును ఆశ్రయిస్తాం:
చాలామంది జన్మభూమి కమిటీల పుణ్యమా అని పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తొలగింపునకు గురైన వితంతు, వృద్ధాప్య, ఇతర ఏ పింఛన్లు అయినా అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలని..తద్వారా లోకాయుక్త కోర్టును ఆశ్రయించి న్యాయం పొందనున్నట్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలియజేశారు. ఎవరూ బాధపడొద్దని.. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు.