ఎవరా...ఐదుగురు | who is five members | Sakshi
Sakshi News home page

ఎవరా...ఐదుగురు

Published Thu, Jul 28 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

ఎవరా...ఐదుగురు

ఎవరా...ఐదుగురు

  • జిల్లాకు చుట్టిన ఎంసెట్‌–2 ఉచ్చు
  •  ఖమ్మంలో మెరిట్‌ ర్యాంకర్ల వివరాలు సేకరించిన సీఐడీ
  • విద్యార్థుల తల్లిదండ్రుల విచారణ..నేడో, రేపో అరెస్ట్‌లకు సిద్ధం

  • ఖమ్మం :  సంచలనం సృష్టించిన ఎంసెట్‌–2 లీకేజీ వ్యవహారం జిల్లాను తాకింది. రాష్ట్రవ్యాప్తంగా 72 మంది విద్యార్థులకు పరీక్షకు ముందుగానే ప్రశ్నపత్రాలు అందాయన్న అభియోగంలో జిల్లాకు చెందిన ఐదుగురు ఉన్నారని  ‘సీఐడీ’ తేల్చినట్లు సమాచారం. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్న మార్కెట్‌ వ్యాపారి కుమారుడితోపాటు, నగరానికి సమీపంలో ఉన్న గ్రామానికి(ఖమ్మంరూరల్‌ మండలం) చెందిన విద్యార్థి, కొణిజర్ల మండలానికి చెందిన మరో విద్యార్థికి సంబంధించిన వివరాలతోపాటు ఇంటర్మీడియట్‌ ప్రథమసంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో సాధించిన మార్కులు, ఏపీ ఎంసెట్‌లో విద్యార్థి ర్యాంకు మొదలైన విషయాలను సేకరించినట్లు తెలిసింది.  ఖమ్మం నగరానికి చెందిన మరో ఇద్దరికి సంబంధించిన వివరాలను కూడా సీఐడీ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రుల మొబైల్‌ డేటా ఆధారంగా ఎంసెట్‌–2కు  ముందు 20 రోజుల నుంచి పరీక్ష జరిగిన నాటి వరకు ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్‌ కాల్స్, టెలిఫోన్‌ సంభాషణను సీఐడీ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా వారి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఎప్పుడు.. ఎన్ని డబ్బులు డ్రా చేశారు. ఆన్‌లైన్‌ అకౌంట్‌ నుంచి  ఏఏ అకౌంట్‌లకు డబ్బులు పంపించారనే విషయం అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా జిల్లాకు చెందిన ఐదుగురు విద్యార్థులకు ఎంసెట్‌–2 ప్రశ్నపత్రాలు ముందుగానే వచ్చాయని నిర్ధారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మెరిట్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను హైదరాబాద్‌కు పిలిపించుకొని విచారించినట్లు సమాచారం. ఎక్కడ చదువుకున్నారు..? ఎంసెట్‌ కోచింగ్‌ ఎక్కడ తీసుకున్నారు..? పరీక్ష  కేంద్రాలు ఎక్కడ.. పరీక్ష ఎలా రాశారని.. కోచింగ్‌ సెంటర్లలో నిర్వహించిన పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి.. అనే విషయాలను విద్యార్థులను అడిగినట్లు తెలిసింది. తల్లిదండ్రుల విచారణలో వారి వృత్తి, ఆర్థిక పరిస్థితులు, పిల్లలను డాక్టర్లుగా చూడాలనే కోరిక మొదలైన అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మరికొన్ని కోణాల్లో పరిశీలించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి అరెస్ట్‌ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
    ఏ నిమిషంలోనైనా అరెస్ట్‌లు..
    ఎంసెట్‌–2 లీకేజీకి లక్షల రూపాయల ముడుపులు చెల్లించి.. పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలను సేకరించడం, బెంగుళూరు, ముంబై వంటి నగరాలకు వెళ్లి  ప్రిపేర్‌ అయ్యి  నేరుగా కేంద్రాలకు వచ్చి పరీక్ష రాసి.. 1000 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఏ నిమిషంలోనైనా అరెస్ట్‌చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో సీఐడీ అధికారులకు ఏ విధమైన సమాచారం అందింది.. ఎవరిని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారు. వారి అరెస్ట్‌తో జిల్లాకు చెందిన మరికొందరి పేర్లు బయట పడతాయా..? ఎప్పుడు ఎవరికి ఏ ఉచ్చు బిగుస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement