
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై పెరిగిన దాడులపై జరిగిన విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు.
దేవాలయాలపై దాడుల ఘటనలు హిందూ అమెరికన్ల ఆవేదనకు కారణమవుతున్నాయని, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులపై విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దాడుల నేపథ్యంలో చాలామంది హిందువులు భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సి వస్తోందని వారు వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు.
జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment