
ఆమె కోసం వేట
♦ జల్లెడపడుతున్న పోలీసులు
♦ సీరియల్ కిల్లర్ హత్యలపై ఆరా
ఇంతకీ ఆమె ఎవరు? ఒక హంతకుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పెద్ద ఎత్తును చేపట్టిన గాలింపు చర్యలతో కె.గంగవరం మండలంలో ఒక్క సారిగా అలజడి రేకెత్తించింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున చేపట్టిన పోలీసుల గాలింపులతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు.
తూర్పు గోదావరి : భక్తి ముసుగులో మహిళలను లోబరుచుకుని వారిని హతమార్చిన సీరియల్ కిల్లర్ సంఘటన నాలుగు నెలల క్రితం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఒక మహిళ హత్య కేసులో దొరికిన సీరియల్ కిల్లర్ సలాది లక్ష్మీనారాయణను రాజోలు పోలీసులు ఈ ఏడాది జనవరిలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో అతను చేసిన హత్యలు ఒక్కోక్కటిగా బయటపడ్డాయి. కె.గంగవరం మండలం దంగేరుకు చెందిన దుర్గ అనే మహిళను కూడా లోబరుచుకుని హత్య చేసినట్లు లక్ష్మీనారాయణ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది.
దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడపట్టారు. దంగేరుకు చెందిన దుర్గ అనే మహిళ నాలుగు నెలల క్రితం అదృశ్యమైనట్టు తెలుసుకోని పోలీసులు ఆరా తీశారు. అలాగే దంగేరు శివారు చిట్టూరివారిపాలెంకు చెందిన ఒక దుర్గ మూడేళ్లుగా విదేశాలు వెళ్లి తిరిగి రాలేదనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరించారు. అయితే ఆమె హంతకుడు చెబుతున్న మహిళ కాదని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే రామచంద్రపు రంలోని ముచ్చిమిల్లి రోడ్లు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో గాలిస్తున్నా రు.
దంగేరు పరిసర గ్రామాలకు చెందిన దుర్గ అనే పేరు గల మహిళను లక్ష్మీనారాయణ హత్య చేయడం వాస్తవమని, అయితే ఆమె ఆచూకీ లభ్యంకావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళ కోసం ఇప్పటికే దంగేరు చుట్టు పక్కల గ్రామాల్లో పోలీసులు విచారించారు. రామచంద్రాపురం సీఐ శ్రీధర్‌కుమార్‌తో పాటు మండపేట టౌన్ సీఐ, మండపేట, రామంచద్రపురం, ఆలమూరు, ఆనపర్తి, అంగర ఎస్సైలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
ఆచూకీ తెలపండి
హంతకుడు లక్ష్మీనా రాయణ చేతిలో హ తమైన దుర్గ ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రామచంద్రపురం సీఐ శ్రీధర్‌కుమార్, కె.గంగవరం ఎస్సై నరేష్ తెలిపారు. దంగేరు చుట్టు ప్రక్కల గ్రామాల్లో దుర్గా అనే పేరు గల మహిళ 2014–15లో అదృమై ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందిస్తే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు.