
‘గెలుపు గుర్రం’ ఎవరు?
♦ వరంగల్ అభ్యర్థిపై సీఎం కేసీఆర్ కసరత్తు
♦ అభ్యర్థి ప్రకటనతోనే సగం విజయం దక్కించుకోవాలని వ్యూహం
♦ ఆచితూచి అడుగులు వేస్తున్న అధికార పార్టీ
♦ టికెట్ రేసులో పార్టీ నేతలతోపాటు ఉద్యమ సంఘాల నాయకులు
సాక్షి, హైదరాబాద్ : ఓరుగల్లు ఉప పోరులో విజయం కోసం అధికార టీఆర్‌ఎస్ వ్యూహ రచనలో నిమగ్నమైంది. అభ్యర్థి ప్రకటన తోనే సగం విజయం సాధించాలన్న తలంపుతో కసరత్తు చేస్తోంది. రెండు పర్యాయాలు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో సర్వే చేయించిన గులాబీ పార్టీ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటికే విపక్షాలు వరంగల్ ఉప ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు, పదహారు నెలల టీఆర్‌ఎస్ పాలనకు రెఫరెండంగా ప్రచారం మొదలు పెట్టడంతో మరింత జాగ్రత్తగా ఎత్తులు వేస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్యులతో మంతనాలు జరుపుతున్నారు. శనివారం రాత్రి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి అధికారిక నివాసానికి చేరుకున్న సీఎం.. ఆదివారం ఉదయం కొందరు పార్టీ ముఖ్యులను పిలిపించుకుని మరోసారి వరంగల్ ఎంపీ అభ్యర్థిపై చర్చించినట్లు సమాచారం.
టికెట్ రేసులో ఎవరెవరు?
టీఆర్‌ఎస్ తరపున ఈసారి బరిలోకి దిగాలని ముందు నుంచీ పార్టీలో ఉన్న నాయకులతోపాటు తెలంగాణ ఉద్యమంలో కలసి నడిచిన ఉద్యమ సంఘాల నేతలూ పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు అన్ని రకాల సమీకరణాలను పార్టీ విశ్లేషిస్తోంది. పార్టీ జరిపించిన సర్వే ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వచ్చినా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అభ్యర్థి ఎంపిక, పేరు ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 4 నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతో వచ్చేనెల ఒకటి, రెండు తేదీల్లోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నవారిలో పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తోపాటు ప్రొఫెసర్ సాంబయ్య, రవికుమార్, దయాకర్, ఇటీవలే పార్టీలో చేరిన పరంజ్యోతి వంటి వారు ఉన్నట్టు సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కుటుంబంలో ఒకరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి ముగ్గురి పేర్లతో జాబితాను కుదించారని వినికిడి. ఇతర పార్టీల అభ్యర్థులు ఖరారయ్యాక తమ అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో కూడా టీఆర్‌ఎస్ నాయకత్వం ఉందంటున్నారు.
హరీశ్‌కు ఎన్నికల బాధ్యత?
ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేరుస్తారని పేరున్న మంత్రి హరీశ్‌రావుకు వరంగల్ ఉప ఎన్నికల బాధ్యతను అప్పజెప్పే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలిసింది. వరంగల్‌తోపాటు నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక బాధ్యతలు హరీశ్‌కు అప్పజెప్పుతారని ప్రచారం జరిగింది. దీనికి తగిన ట్లే ఆయన ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. గతంలో వరంగల్ జిల్లా పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల బాధ్యతను భుజానా వేసుకున్న హరీశ్ అక్కడి అభ్యర్థులను గెలిపించారు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నిక బాధ్యతను ఆయనకే కట్టబెడతారని సమాచారం.