
పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి
కొండమల్లేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, తమ పంట పొలాలు నష్టపోయి రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించడంతో పాటు రైతులకు పూర్తిగా రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రాపోలు జయప్రకాశ్, రమావత్ జగన్‌లాల్‌నాయక్, ఉట్కూరి వేమన్‌రెడ్డి, తేరా సత్యనారాయణరెడ్డి, యూనుస్, వెంకటేష్, శంకర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవి పాల్గొన్నారు.