బోధన అంటే బాధ ఎందుకో?
‘ అన్ని వైద్య విభాగాల్లో మధ్యాహ్నం రెండు గంటలపాటు పీజీ వైద్యులకు బోధన జరిగేలా చూడాలి’
– ఇటీవల జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బోధనతీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) చేసిన హెచ్చరిక ఇది. అయితే ఈ హెచ్చరికను జీజీహెచ్ బోధనా సిబ్బంది బేఖాతరు చేస్తూ మా ‘పని’ మాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో వైద్య విద్యార్థులకు బోధన చేయాల్సిన బోధనా సిబ్బంది తమ తీరు మార్చుకోవడం లేదు. క్రమం తప్పకుండా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత వీరిపై ఉన్నప్పటికీ తమ సొంత ఆస్పత్రుల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌లకు ఇస్తున్న ప్రాధాన్యత బోధనకు ఇవ్వడం లేదు.
మధ్యాహ్నానికే ఇళ్లకు..
జీజీహెచ్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నానికే ఆస్పత్రి నుంచి వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ, రోగులకు వైద్య సేవలు అందించి మధ్యాహ్నం గంట సేపు భోజన విరామం తరువాత 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య విద్యార్థులకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జీజీహెచ్‌లో మాత్రం ఒకటి, రెండు వైద్య విభాగాల్లో తప్ప మిగతా విభాగాల్లో ఎక్కడా బోధన చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రొఫెసర్ వేధింపుల వల్ల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈకేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి ప్రస్తుతం రిమాండ్‌లోనే ఉన్నారు. ఇంత జరిగినా జీజీహెచ్‌లో పనిచేసే వైద్యులకు చీమ కుట్టినట్లయినా లేదనే విమర్శలు వస్తున్నాయి. జీజీహెచ్‌లోని వివిధ వైద్య విభాగాల్లో జరుగుతున్న బోధన, ఇతర అంశాలపై దృష్టి సారించాల్సిన వైద్య అధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో బోధనా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జీజీహెచ్‌లో కొద్దిమంది ప్రొఫెసర్లు మినహా మిగతా వారంతా సొంత క్లీనిక్‌లు నడుపుతూ ప్రైవేటు ప్రాక్టీస్‌లు చేసుకుంటున్నారు. దీనిపై గతంలో విజిలె¯Œ్స నివేదిక ఆధారంగా 19 మందికి ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ వీరి తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయం.
డీఎంఈ తనిఖీల్లో బయటపడ్డ నిర్వాకం..
ఇటీవల గుంటూరు జీజీహెచ్‌లోని పలు వైద్య విభాగాలలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో డీఎంఈ డాక్టర్ సుబ్బారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. ఆ సమయంలో ప్రతి వైద్య విభాగంలో వైద్య బోధన జరగాల్సి ఉండగా రెండు, మూడు విభాగాల్లో మినహా మిగతా విభాగాల్లో జరగడం లేదన్న విషయాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కనీసం జీజీహెచ్‌లో కూడా లేకుండా బయటకు వెళ్ళి ప్రైవేటు ప్రాక్టీసులు చేసుకుంటున్నట్లు గుర్తించారు. దీనిపై డీఎమ్‌ఈ ఇలాగైతే వైద్య విద్యార్థులతో సత్సంబంధాలు ఎలా మెరుగుపడతాయంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. డీఎమ్‌ఈ తనిఖీకి వచ్చిన మరుసటి రోజు నుంచి షరా మామూలుగానే వైద్యులంతా మధ్యాహ్నానికే ఇంటిబాట పడుతుండటం కనిపించింది. జీజీహెచ్ ఉన్నతాధికారులు ఇప్పటిౖకెనా దృష్టి సారించి సాయంత్రం 4 గంటల వరకూ వైద్యులు జీజీహెచ్‌లో ఉండేలా చూస్తే అటు వైద్య విద్యార్థులకు, రోగులకు మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు.