ఎందుకింత నిర్లక్ష్యం?
ఎందుకింత నిర్లక్ష్యం?
Published Sun, Nov 20 2016 11:48 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
- ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై ఎమ్మెల్యే గౌరుచరిత ఆగ్రహం
- విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- కళాశాలల్లో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన
పాణ్యం: ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలికావడంపై ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నెరవాడమెట్ట సమీపంలోని ఆర్‌జీఎం కళాశాలలో బద్వేల్‌కు చెందిన ఉషారాణి ర్యాగింగ్‌ను భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆ కళాశాలకు వెళ్లిన ఎమ్మెల్యే విద్యార్థిని మృతికి గలకారణాలను తోటి విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్‌పై ఆరా తీశారు. లక్షల రూపాయాలు ఫీజుల రూపంలో దండుకోని ఆడపిల్లలకు రక్షణ కల్పించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ భూతం ఉన్న కళాశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. తక్షణమే అలాంటి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఉషారాణి తండ్రి ఐదు సార్లు మీకు ఫిర్యాదు ఇచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదని కళాశాల ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. విద్యార్థిని మృతికి కారణమైన సీనియర్ విద్యార్థులు ,అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే ఉషారాణి మృతికి కారణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ర్యాగింగ్ భూతానికి గుంటూరులో రిషితేశ్వరి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, తహసీల్దార్ వనజాక్షిపై సాక్షాత్తు ఎమ్మెల్యే దాడి తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు.
శాంతిరాంపై ఆగ్రహం
కొండజుటూరు గ్రామంలోని పచ్చని పొలాల మధ్యలో నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు యత్నించి ఒకరి ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఓ విద్యార్థినిని బలిగొన్నారని ఆర్‌జీఎం కళాశాల నిర్వహకుడు శాంతిరాముడు పై ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ మార్గాలను పక్కనపెట్టి కళాశాలలో ముందుగా ర్యాగింగ్‌ను నిర్మూలించుకోవాలని సూచించారు.
Advertisement