
తిరువొత్తియూరు(తమిళనాడు) : ఓ హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని దిండుగల్‌లో మంగళవారం జరిగింది. దిండుగల్‌లోని ఓ ప్రయివేటు కళాశాలలో ధరణి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. తలకు తీవ్రగాయాలైన ఆమెను హాస్టల్ నిర్వాహకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
మేం వచ్చేలోగానే..: ఈ క్రమంలో ధరణి మృతిపై సందేహాలున్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె సోమవారం రాత్రి ఫోన్ చేసి హాస్టల్ వార్డెన్ తనతో కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిందని, ఉదయాన్నే వచ్చి తనను తీసుకెళ్లాలని కోరిందని విద్యార్థిని తల్లి చెప్పారు. తాము హాస్టల్‌కు వచ్చేలోగానే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మృతిపై విచారణ జరపాలని ఆమె కోరారు.