ఆ నాలుగు స్థానాలకు పెండింగ్...ఎందుకో?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన రాజకీయాలకు తెరలేపాయి. పన్నెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకే రోజు ఏడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన గులాబీ నాయకత్వం మరో అయిదు స్థానాలను మాత్రం పెండింగులో పెట్టింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి చొప్పున, వరంగల్‌లో ఒక స్థానానికి ఇంకా అభ్యర్ధులు ఖరారు కావాల్సి ఉంది. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్సీలు అందరికీ ఈసారీ అవకాశం ఇవ్వడంతో మహబూబ్‌నగర్‌లో జగదీశ్వర్‌రెడ్డికి ఒక స్థానం దాదాపు ఖాయమైన ట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన నాలుగు స్థానాల్లో అభ్యర్ధిత్వాలకు విపరీతమైన పోటీ, వివిధ రాజకీయ సమీకరణల వల్ల పెండింగులో పెట్టారంటున్నారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
టికెట్ల కోసం పోటా పోటీ !
మహబూబ్‌నగర్ రెండు స్థానాల్లో ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డికి ఖాయమవుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. మరో స్థానానికి మాత్రం డిమాండ్ పెరిగింది. కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీ హామీతో విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంది. ఇపుడు నారాయణరెడ్డికి అవకాశం ఇవ్వాలంటే ఒకే జిల్లాలో ఒకే ‘కమ్యూనిటీ’ నుంచి ఇద్దరికి ఎలా అవకాశం ఇస్తారన్న చర్చ వచ్చిందని తెలిసింది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఈ జిల్లాలో ఓసీ, బీసీలకు చెరో టికె ట్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిందని. వరంగల్ జిల్లాలోనూ టికెట్‌కు డిమాండ్ ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్న నేత లు, దానితో లింకు పెట్టుకోవడంతో అభ్యర్ధిత్వం పెండింగ్‌లో పడిందని సమాచారం.
ఇక్కడి నుంచి జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు టికెట్ ఆశించినా, ఆయన పేరు తెరవెనుకకు వెళ్లిపోయిందని, ఇపుడు రేసులో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, రాజయ్య యాదవ్‌ల పేర్లు ఉన్నాయని సమాచారం. కొండా మురళి తన భార్య కొండా సురేఖకు మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తూ ఎమ్మెల్సీ టికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదంటున్నారు. పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి ఈ సారికి టికెట్ కొండా మురళికే ఇవ్వాలన్న చర్చ జరిగిందని, రాజయ్య యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, మహబూబ్‌నగర్‌లో జైపాల్ యాదవ్, వరంగల్‌లో రాజయ్య యాదవ్‌లలో ఒకరికే అవకాశం దక్కనుందని, ఈ లింక్ వల్ల కూడా అభ్యర్ధులను ప్రకటించలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రసవత్తరంగా ... రంగారెడ్డి రాజకీయం
మరో వైపు రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ రెండు స్థానాలు ఉండగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డికి ఖాయమవుతుందని భావించారు. కాగా, ఒకే కుటుంబం నుంచి మంత్రిగా మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతా మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో అదే కుటుంబం నుంచి నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఆ జిల్లాకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు అడ్డం పడ్డారని తెలిసింది. ఎమ్మెల్సీ టికెట్ పరిశీలనలో శంభీర్‌పూర్ రాజు, సామల వెంకటరెడ్డి , హరీశ్వర్‌రెడి వంటి వారి పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. నరేందర్‌రెడ్డిని పక్కన పెడితే కూడా అందరు సిట్టింగులకు ఇచ్చి, ఆయనకు ఇవ్వక పోవడం కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చిన ట్టే కదా అన్న చర్చ జరిగిందంటున్నారు. కాగా, ఒక స్థానాన్ని ఏక గ్రీవం చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయని, సమీకరణలు కూడా సంక్లిష్టంగా ఉండడంతో పెండింగ్‌లో పెట్టారని పేర్కొంటున్నారు.