భార్యాభర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు
పూడూరు(వికారాబాద్): వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న భార్యాభర్తలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం అంగడిచట్టంపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన జంగయ్య(45), సుమిత్ర(40) దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తలు వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని అంబులెన్స్ సాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందారు. జంగయ్య గతంలో రెండు వివాహాలు కాగా.. ఇద్దరు భార్యలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సుమిత్ర జంగయ్యకు మూడో భార్య. వీరిద్దరి మృతితో జంగయ్య మొదటి భార్య ఇద్దరు పిల్లలు, రెండో భార్య ఇద్దరు పిల్లలు, సుమిత్ర కూతురు అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.