వివాహేతర సంబంధం వద్దన్నాడని..భర్త హతం
పాల్వంచ: ఖమ్మంలో దారుణం జరిగింది. చెడు తిరుగుళ్లు మానేయాలని మందలించిన భర్తపై కోపం పెంచుకున్న భార్య అతన్ని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో శనివారం చోటుచేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న గోపాలకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య రాములమ్మ అదే కాలనీకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన గోపాలకృష్ణ తీరు మార్చుకోవాలని మందలించాడు. అయినా లాభం లేకపోయింది. దీంతో భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి.
దీనిపై రెండు రోజులుగా భార్య,భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతుండగా.. శుక్రవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అదును చూసి గొడ్డలితో దాడి చేసి హతమార్చిన రాములమ్మ అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మతో పాటు, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.