‘పైసా’చికం | Wife Murder his Husband in Nellore district | Sakshi
Sakshi News home page

‘పైసా’చికం

Published Fri, May 5 2017 3:26 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

‘పైసా’చికం - Sakshi

‘పైసా’చికం

► డబ్బు కోసం కుటుంబంలో గొడవ
► భార్య, కుమారుడి చేతిలో రైతు హతం
► వెంటాడి రోకలిబండతో చంపిన వైనం
► ముదిగేడులో ఘాతుకం 
 
పొదలకూరు (సర్వేపల్లి) : భార్య, కొడుకు చేతిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తల్లీకొడుకు కలిసి రోకలిబండతో దాడి చేసి కుటుంబ యజమానిని మట్టుబెట్టారు. ఈ సంఘటన మండలంలోని ముదిగేడు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మాలపాటి యానాదిరెడ్డి (55) వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. ఈయనకు భార్య లీలమ్మ (45), కొడుకు శేఖర్‌రెడ్డి (25), ఇద్దరు కుమార్తెలున్నారు.

కుమార్తెలకు వివాహం చేసి ఇంట్లో భార్య, కుమారుడితో ఉంటున్నాడు. యానాదిరెడ్డి భార్య, కొడుకుతో తరచుగా గొడవ పడేవాడు. మూడురోజుల క్రితం వ్యవసాయంలో రూ.50 వేలు ఆదాయం వచ్చింది. యానాదిరెడ్డి ఆ నగదును అప్పుల వాళ్లకు చెల్లించినట్టుగా కుటుంబసభ్యులకు చెప్పాడు. ఈక్రమంలో ఇంటి అవసరాలు నగదు లేకుండా చేశాడని భార్య, కుమారుడు యానాదిరెడ్డితో గొడవపడ్డారు. తర్వాత ఏంజరిగిందో గానీ రాత్రి ఇంట్లో పడుకుని ఉన్న యానాదిరెడ్డిపై భార్య, కొడుకు రోకలిబండతో దాడిచేసి హతమార్చారు. హతుడు ప్రాణాలు కాపాడుకునేందుకు వారి బారినుంచి తప్పించుకుని ఇంట్లో నుంచి పరుగులు తీసి వీధిలో పడిపోయాడు.

ఇష్టానుసారం దాడిచేయడంతో యానాదిరెడ్డికి తలనిండా తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ఒకరిద్దరు అడ్డు వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయిందని తెలుస్తోంది. నిందితులిద్దరు పోలీసులకు లొంగిపోయారు. ఈ సంఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం రేపింది. సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి ప్రాథమిక విచారణ చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement