సమస్యల పరిష్కారానికి కృషి
Published Wed, Aug 10 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
∙ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ అరుణకుమారి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీకాకుళం ఆర్టీసీ రెండో డిపో మేజనేజర్ నంబాళ్ల అరుణకుమారి అన్నారు. డిపో పరిధిలో ఆ డిపో మేనేజర్ నంబాళ్ల అరుణకుమారి బుధవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి నాలుగు వినతులు వచ్చాయి. బందరువానిపేటకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన డి.శ్రీనివాసరావు అనే వ్యక్తి కోరగా ఈ రూట్ శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలోకి వస్తుందని, ఆ డిపో డీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళతానని ఆమె చెప్పారు.
కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నడిపే కృష్ణా పుష్కరాల ప్రత్యేక బస్సులను నగరంలోని గుజరాతిపేట వద్దనున్న లక్ష్మీటాకీస్ మీదుగా నడపాలని ఆ ప్రాంతానికి చెందిన యజ్ఞేశ్వరరావు కోరారు. దీనిపై డీఎం అరుణకుమారి స్పందిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున పోలీసుల వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి డే అండ్ నైట్ కూడలి, కొత్తబ్రిడ్జి మీదుగా నడుపుతున్నామని చెప్పారు. బత్తిలి రూట్‌లో ప్రయాణికులు చెయ్యెత్తినచోట నిలుపుదల చేయడం లేదని సంతోష్ అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. దీనికి సమాధానంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఆపాలని సిబ్బంది ఆదేశించామన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణానికి వెళ్లేందుకు సాయంత్రం 5గంటల సమయంలో నాన్‌స్టాప్ బస్సు నడపాలని వెంకటరామిరెడ్డి అనే ప్రయాణికుడు కోరారు. దీనికి స్పందించిన డీఎం అరుణకుమారి మాట్లాడుతూ శ్రీకాకుళం–విశాఖ రూట్ శ్రీకాకుళం ఒకటో డిపో పరిధికి వస్తుందని, ఈ విషయాన్ని ఒకటవ డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.
Advertisement