
'ఏపీలో బీజేపీని అణగదొక్కాలని చూస్తే ఊరుకోం'
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షం బీజేపీల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, శాంతారెడ్డి తదితరులు ఈ అంశంపై వైఎస్ఆర్ జిల్లా కడపలో మీడియాతో మాట్లాడారు. బీజేపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని, మిత్రపక్షంగా కలుపుకొని వెళ్లాలని కావూరి వ్యాఖ్యానించారు. టీడీపీ పద్ధతి మారాలని ఆయన సూచించారు. జన్మభూమి కమిటీలలో రాజకీయ జోక్యం కారణంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని, ఇది ఎవరికీ మంచిది కాదని చెప్పారు. పేదలకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
ఇక.. రాజధాని భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించిందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌తో టీడీపీ నేతలు కోట్లకు పడగలెత్తుతున్నారని శాంతారెడ్డి ఆరోపించారు.