తెల్లవార్లూ మద్యం అమ్మకాలు
Published Wed, May 10 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM
మద్యం సిండికేట్లు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయాలు రహస్యంగా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భాలలో జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన మంత్రులను బూచీగా చూపిస్తున్నారు. రాత్రిళ్లు షాపులో బయట తాళాలు వేసినా షట్టర్‌కు చేసిన రంధ్రం ద్వారా తెల్లవార్లు మద్యం విక్రయిస్తున్నారు. రాత్రిళ్లు బాటిల్‌ను నిర్ణీత మొత్తం కంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 వరకూ వసూలు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) :
జిల్లాలో 545 మద్యం షాపులు ఉండగా రెండు నెలల క్రితం లాటరీ పద్ధతిలో 521 షాపులకు కేటాయింపులు చేశారు. మరో 24 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూలై నుంచి కొత్త లైసెన్సులు అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్లు ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారు. మంచినీళ్లు దొరకని ప్రాంతాల్లో కూడా మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అమ్మకాలు సాగించాలి. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తెల్లవార్లూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో అప్సరా థియేటర్ వద్ద షాపులో ఉదయం 5 గంటల సమయంలో అమ్మకాలు సాగిస్తున్నందుకు ఏజీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలమూరులో కూడా రెండు షాపులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
చక్రం తిప్పుతున్న సిండికేట్లు
మద్యం సిండికేట్లే మద్యం రేట్లు నిర్ణయిస్తున్నారు. మద్యం కంపెనీలు రేట్లు పెంచినందున లాభాలు రావడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుకొని అమ్ముకుంటామని మద్యం వ్యాపారులు గతంలో ప్రభుత్వానికి అనుమతిని కోరుతూ లేఖ రాశారు. అయితే ప్రభుత్వం విధానం ఇంకా ప్రకటించకుండానే వ్యాపారులు రేట్లు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తుంటే.. ఆ రేట్లకు మించి ఒక్కో బాటిల్‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా రేటు నిర్ణయించారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షాపులు మూసి వేయాలనే విధానంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండడంతో పాత షాపులనే కొనసాగిస్తున్నారు.
తెలుగు తమ్ముళ్లకే ఎక్కువ షాపులు..
ఎక్సైజ్ అధికారులు ఇటీవల జిల్లాలో నిర్వహించిన లాటరీలో తెలుగు తమ్ముళ్లే ఎక్కువ షాపులను దక్కించుకున్నారు. అధికారులును ప్రలోభాలకు గురి చేసి షాపులకు ఎవరూ అడ్డు రాకుండా చేసుకోగలిగారు. కొన్ని చోట్ల 20 ఏళ్లుగా షాపు నిర్వహిస్తున్న వ్యక్తికే తిరిగి షాపు దక్కేలా పావులు కదిపారు. ఎవరైనా ఆ షాపు కోసం దరఖాస్తు చేస్తే మొదటిలోనే అడ్డుకొని దరఖాస్తు చేసిన వారిపై దౌర్జన్యం చేసి భయపెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ లాటరీ పద్ధతిపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోలేకపోతున్న అధికారులు
ప్రతి షాపులో ఎమ్మార్పీకే విక్రయాంచాలన్న నిబంధన అమలుపై ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు అందినప్పటికీ షాపు యజమానులపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండడంతో వారి ద్వారా ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
చర్యలు చేపడతాం
మద్యం షాపుల అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. షాపుల కేటాయింపు పారదర్శకంగా జరిగింది. జూ¯ŒS 30తో పాత షాపులు గడువు ముగుస్తుంది. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్టు దృష్టికి వస్తే షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తాం.
– బత్తుల అరుణరావు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ
Advertisement
Advertisement