విద్యుదాఘాతంతో బాలుడి మృతి
బీబీనగర్ : ఆటాడుకుంటున్న ఓ బాలుడు వేలాడుతున్న కరెంటు తీగను పట్టుకుని విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం... ఒరిస్సా రాష్ట్రంలోని బీర్షాపూర్‌కు చెందిన శంకర్, భార్య కల్లీతో కలిసి మండలంలోని బ్రహ్మణపల్లికి వలస వచ్చారు. వీరికి సంవత్సరం వయస్సు ఉన్న తిరుపతి అనే బాలుడు ఉన్నాడు. శంకర్ స్థానికంగా ఉన్న పవర్ ప్లాంట్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదివారం శంకర్ బయటకు వెళ్లగా అతడి భార్య ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలో బాబును ఇంట్లోనే వదిలేయగా అంబాడుకుంటూ ఆడుకుంటున్న బాలుడు నేలకు తాకి ఉన్న కరెంటు వైరు పట్టుకున్నాడు. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో బాలుడు షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాబు బతికే ఉండవచ్చని ఆశతో తల్లిదండ్రులు, బంధువులు బీబీనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు రాగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ చెప్పడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు.
స్థానికుల ఆర్థిక సాయం...
బతుకు దెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలకు స్థానికులు, బంధువులు ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కగానొక్క కుమారుడి మృతి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సొంత ఊరికి వెళ్లేందుకు డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి స్థానిక ఉపసర్పంచ్ అక్బర్, స్థానికులు ఆసరగా నిలిచి ఆర్థిక సాయం అందజేసి పంపించారు.