- పుట్టుకొస్తున్న నకిలీ రొయ్య పిల్లల హేచరీలు
- బ్రూడర్స్‌తో ఎక్కువ సార్లు పిల్లలు పెట్టిస్తున్న వ్యాపారులు
- చెరువుల్లో పోసిన రెండు రోజులకే చనిపోతున్న సీడ్
- రూ.కోట్ల నష్టాలతో దివాళా తీస్తున్న రైతులు
- ప్రశ్నార్థకంగా మారుతున్న రొయ్య సాగు
వాకాడు: నెల్లూరు జిల్లా తీరం వెంబడి దాదాపు 1.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వాసాగు జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే రొయ్య పిల్లల హేచరీలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాలో డాలర్ సేద్యంగా విరాజిల్లిన రొయ్యల సాగు అప్పట్లో కనక వర్షం కురిపించింది. నేడు అదే రొయ్యల సాగు ప్రశ్నార్థకంగా మారింది. తీర ప్రాంతాల్లో రొయ్యల సాగు ఏర్పడిన తరువాత పల్లెలు పట్టణాలుగా, కాలిబాటలు కార్ల రహదారులుగా, నిరుపేదలు ధనవంతులుగా.. ఇలా తీర ప్రాంతాలు సమూలంగా అభివృద్ది చెందాయి. ఈ నేపథ్యంలో రొయ్యల సాగుపై అనుభం ఉన్నా, లేకున్నా చాలామంది ఇందులో దిగారు. అందుకు అనుగుణంగానే రొయ్య పిల్లల హేచరీలు తీరం వెంబడి అధిక సంఖ్యలో వెలసి రైతులను బాగా మోసం చేస్తున్నాయి. దీంతో రైతులు ఎంత పరిశీలించి సీడ్‌ను తీసుకెళ్ళినా హేచరీ యజమానులు ఏదోరకంగా మోసం చేస్తూనే ఉన్నారు.
నాసిరకం రొయ్యపిల్లలతో రైతులు కోట్ల రూపాయిలు నష్టపోయి దివాళ తీస్తున్నారు. సీడ్ తెచ్చి చెరువులో పోసిన రెండ్రోజులకే 40 శాతం పిల్లలు చనిపోతున్నాయి. మిగిలిన 60 శాతం పిల్లలు వారం, పది రోజుల్లో చనిపోతున్నాయి. ఈ నేపథ్యంతో నష్టాలు చవి చూస్తున్న రైతులు సాగుపై పెద్దగా మొగ్గు చూపడంలేదు. జిల్లా తీరం వెంబడి దాదాపు 125 హేచరీలు ఉన్నాయి. అందులో 75 హేచరీలకే అధికారికంగా అనుమతులు ఉన్నాయి. సీఏఏ(కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ) పర్మిషన్‌తో 66 హేచరీలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్‌తో తొమ్మిది నడుస్తున్నాయి. మిగిలిన హేచరీలు ఎలాంటి అనుమతులు లేకుండానే రొయ్య పిల్లలను విక్రయిస్తున్నాయి. వాటిపై మత్స్యశాఖ అధికారులు పరిశీలన జరిపిన దాఖలాలు లేవు. వాస్తవానికి మత్స్యశాఖ అధికారులు నెలకు రెండుసార్లు హేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు పలు సూచనలు, సలహాలను ఇవ్వాల్సి ఉంది. ఐతే నేడు అలా జరగడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు బీడుగా ఉన్న భూముల్లోనే రొయ్యల సాగు చేయాల్సి ఉంది. ఈ మేరకు విద్యుత్ సర్వీసులు, సీఏఏ పర్మిషన్లు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వ ఆదేశించింది. కాని క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. అదేవిధంగా రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే బ్లోడర్స్ విషయంలో కూడా హేచరీల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఒక తల్లి రొయ్య(బ్లోడర్)తో మూడు సార్లు మాత్రమే రొయ్య పిల్లలు పెట్టించాలి. అలా జరిపిన పిల్లలు రొయ్యల చెరువుల్లో దాదాపు 75 నుంచి 85 శాతం వరకు సక్సెస్ అవుతాయి. అదే తరహాలోనే వైరస్ లేకుండా మంచి దిగుబడులు కూడా వస్తాయి. ఈ ప్రక్రియ ఏ ఒక్క హేచరీలో కూడా జరగడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్క తల్లిరొయ్య(బ్లోడర్) నుంచి 5 నుంచి 8 సార్లు పిల్లలను పెట్టించడం వల్ల రొయ్య పిల్లలు బలహీనంగా ఉండి రైతులకు భారీగా నష్టం జరుగుతుంది. కొన్ని హేచరీలు తొలి కాన్పులో పెట్టించిన పిల్లలు, అలాగే 7, 8 కాన్పుల్లో పెట్టించిన పిల్లలను కలిపి రైతులకు అంటగడుతున్నారు. ఇలా చేయడం వలన వాటి ఎదుగుదల తగ్గిపోతోంది. ఒకవేళ పెరుగుదల ఉన్నా అవి వివిధ సైజుల్లో ఉండటం వల్ల రైతులకు పెట్టుబడులు అధికమై నష్టం జరుగుతుంది.
కొన్ని తల్లిరొయ్యల (బ్లోడర్స్)కు వైరస్ ఉన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటితోనే గుడ్లు పెట్టించి తద్వారా వచ్చిన పిల్లలను రైతులకు విక్రయించడం వల్ల అవి చెరువుల్లో పోసిన కొద్ది రోజుల్లో చనిపోతున్నాయి. వీటి కారణంగా పక్క చెరువుల్లోకి ఈ వైరస్ సోకి రైతులు బాగా నష్టపోతున్నారు. ప్రతి హేచరీకి ఇతర దేశాల నుంచి నాణ్యమైన బ్లోడర్స్ వస్తాయని రైతులకు ఒక నమ్మకం ఉంది. కాని ఇతర దేశాల నుంచి ఒక తల్లి రొయ్యను (బ్లోడర్)ను తెప్పించి దాంతోపాటు లోకల్ బ్లోడర్స్‌ని కలిపి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా హేచరీలపై నమ్మకం లేని రొయ్యి రైతులు పాండిచ్చేరి, భీమవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి సీడ్ కొనుగోలు చేస్తున్నారు.
నకిలీ సీడ్‌తో గ్రోత్ తగ్గిపోతోంది
గతంలో మాదిరిగా రొయ్యల సీడ్ ఇప్పుడు దొరకడం లేదు. అంతా నకిలీల మయంగా మారింది. కనీసం 30 శాతం పిల్లలు కూడా బతకడం లేదు. అలాగే పిల్లల గ్రోత్ బాగా తగ్గిపోయింది. దీంతో అధిక పెట్టుబడులు పెట్టినా ఆశించిన ఫలితాలు రాక బాగా నష్టపోతున్నాము.
రవినాయుడు, ఆక్వా రైతు, దుగరాజపట్నం.
లోకల్ బ్లోడర్స్‌తోనే పిల్లల ఉత్పత్తి
కొన్ని హేచరీలు నకిలీ బ్లోడర్స్‌తో పిల్లలు ఉత్పత్తి చేసి రైతులకు విక్రయిస్తున్నారు. అలా వచ్చిన సీడ్‌ను చెరువులో పోసిన పది రోజులకే చనిపోతున్నాయి. దీంతో హేచరీల యజమానులు బాగుపడుతున్నారే తప్ప రైతులు మాత్రం వరుస నష్టాలతో దివాళా తీస్తున్నారు.
– సురేష్, ఆక్వా రైతు.