వెంగళరావునగర్: అత్యాచారానికి గురై రెస్క్యూ హోంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అదే హోంలో ఉంటున్న యువతి తీవ్రంగా కొట్టి గాయపరిచిన సంఘటన శనివారం స్థానిక యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండేళ్ళ కిందట మెదక్ జిల్లాకు చెందిన ఓ మూగబాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనలో ఆమెను కోర్టు ఆదేశాల మేరకు యూసుఫ్‌గూడ స్టేట్‌హోం ప్రాంగణంలో ఉన్న రెస్క్యూ హోం తరలించారు.
కాగా అదే రెస్క్యూ హోంలో ఉంటున్న సన అనే యువతి కొద్దిరోజులుగా మూగ బాలికను తీవ్రంగా కొడుతోంది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. తోటి యువతులు బాలికను కాపాడుతూ వస్తున్నారు. కాగా బాలిక తాను హోంలో ఉండలేనని, పంపించాలని మూగ సైగలతో ఇన్‌చార్జిని అడుగుతోందని, అందుకే సనతో ఆమెను కొట్టించిందని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై విలేకరులు రెస్క్యూ హోం ఇన్‌చార్జి నిర్మలను వివరణ కోరగా తాను ఎవరినీ కొట్టించలేదని పేర్కొన్నారు.
మూగ బాలిక ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న యువతులు రక్షించారని తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆశ్రిత శనివారం రాత్రి హుటాహుటిన రెస్కూ్యహోంకు వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ విషయంపై విచారణ చేపడుతున్నామని అన్నారు.