కాలువలో జారిపడి మహిళ మృతి
నిడదవోలు : నిడదవోలులో గూడెం రైల్వేగేటు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో మంగళవారం కాలుజారి పడి ఓ మహిళ మృతిచెందింది. పట్టణంలోని చర్చిపేటకు చెందిన తూరుగోపు కుమారి (45) అనే మహిళ కాలువ ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను కాపాడేలోపు మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లల చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. దీంతో కూలీ పనులు చేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి అకాలమరణంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పట్టణ ఎస్సై జి.సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.