సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఒక వృద్ధురాలిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు ఒక జంట. కేవలం లక్ష రూపాయల కోసం 75 ఏళ్ల మహిళను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి స్థానిక కాలువలో విసిరి పారేశారు. తమ అఘాయిత్యం ఎవరికి తెలియదులే అనుకున్నారు. చివరికి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించి, కటాకటాల వెనక్కి వెళ్లకి తప్పలేదు.
సీనియర్ పోలీసు అధికారి సంతోష్ మీనా అందించిన సమాచారం ప్రకారం అనిల్ ఆర్య, అతని భార్య తన్నూ ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్, మృతురాలి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే మాత్రం నిర్లక్క్ష్యంగా వ్యవహరించేవారు. అయితే తన అప్పు తీర్చాల్సిందిగా పదే పదే నిలదీసేది. అది జీర్ణించుకోలేని అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసిన స్థానిక కాలువలో పడేశారు.
నిందితుల సమాచారం మేరకు మృతదేహ భాగాలను కాలువ నుంచి వెలికి తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి అనిల్ దంపతులను అరెస్ట్ చేశారు. మృతురాలిని కవితా గ్రోవర్‌గా గుర్తించారు. కవిత కుమారుడు, స్థానిక రియల్టీ వ్యాపారి మనీష్ గ్రోవర్ ఫిర్యాదు మేరకు విచారణ పట్టిన పోలీసులు కేసును ఛేదించారు.
Comments
Please login to add a commentAdd a comment