నెలలో పెళ్లి.. ఎంత పని చేసింది! | woman killed old woman for ornaments | Sakshi
Sakshi News home page

నెలలో పెళ్లి.. ఎంత పని చేసింది!

Published Fri, Sep 9 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

నిందితురాలు వసుంధరలక్ష్మి,   హతురాలు  ఉమాదేవి (ఫైల్‌ )

నిందితురాలు వసుంధరలక్ష్మి, హతురాలు ఉమాదేవి (ఫైల్‌ )

 చందాగనర్‌:  అమ్మా.. అని పిలుస్తూనే వృద్ధురాలి నగలపై పనిమనిషి కన్నేసింది... అదను కోసం ఎదురు చూసింది.. అన్నం తింటున్న ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతురాలి మెడలోని బంగారు నగలు, చేతి గాజులు తస్కరించింది. పోలీసులు పట్టుకోవడానికి రావడంతో కత్తితో పొట్టలో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మానవత్వం మంటగలిసిన  ఈ దారుణ ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. 

సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం... శేరిలింగంపల్లి లక్ష్మీ విహార్‌ ఫేజ్‌ –2లో 95 నెంబర్‌ గల ఇంట్లో నివాసముండే శ్రీనివాస్, సునీత దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. శ్రీనివాస్‌ తల్లి ఉమాదేవి (65) ఇంట్లోనే ఉంటోంది. వీరి పక్కింటి పనిమనిషి వసుంధర లక్ష్మి(21) రోజూ ఉమాదేవిని అమ్మా.. అని పలకరిస్తూ కబుర్లు చెప్పేది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు కాజేయాలని ఆమె పథకం వేసింది.  శుక్రవారం ఉదయం శ్రీనివాస్, సునీత దంపతులు ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమాదేవి మధ్యాహ్నం 1.50కి భోజనం చేస్తోంది.

అదే సమయంలో పనిమనిషి తలుపు తట్టింది. ఉమాదేవి వెళ్లి తలుపు తీసి.. మళ్లీ అన్నం తింటోంది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అన్నం తింటున్న వృద్ధురాలిపై వసుంధర లక్ష్మి దాడి చేసి కత్తితో గొంతుకోసింది. వృద్ధురాలి అరుపులు విని 94 నెంబర్‌ ఇంట్లో ఉండే రామ్మోహన్ వచ్చి చూడగా ఇంటికి గడియపెట్టి ఉంది.  తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన వెంటనే పోలీసులకు, ఉమాదేవి కుమారుడు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వంటగదిలో వసుంధరలక్ష్మి తచ్చాడుతూ కనిపించింది.

పోలీసులు ఇంట్లోకి వస్తే వారిపై చల్లేందుకు కారంపొడి పట్టుకొని కిటికీ వద్ద నిలుచుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న శ్రీనివాస్‌ అనుమతితో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా వృద్ధురాలు ఉమాదేవి రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె మెడలోని నగలను, గాజులను కాజేసిన పనిమనిషి  వసుంధరలక్ష్మి  వాటిని దేవుడి గదిలో దాచింది.

తన ను పట్టుకోవడానికి వస్తున్న పోలీసులను చూసి కూరగాయలు కోసే కత్తితో పొట్టలో పొడుచుకుంది. పోలీసులు అంబులెన్స్‌లో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా  మార్గంమధ్యలో ఉమాదేవి మృతి చెందింది. నిందితురాలు చికిత్స పొందుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 నెల రోజుల్లో పెళ్లి ..
లక్ష్మీ విహార్‌ ఇంటి నెం. 69లో ఉండే కర్నూలు జిల్లాకు చెందిన అనుపమ ఇంట్లో వసుంధరలక్ష్మి నాలుగేళ్లుగా పని చేస్తూ ఇక్కడే ఉంటోంది. నెల రోజుల్లో పెళ్లి చేస్తామని, తమ కూతురిని ఊరుకు పంపాలని అనుపమను వసుంధరలక్ష్మి తల్లి కోరగా.. తనకు పని మనిషి దొరకగానే పంపిస్తామని చెప్పింది. శుక్రవారం ఉదయం 8.30కి అనుపమ ఉద్యోగానికి వెళ్తూ కొత్త పనిమనిషి దొరికిందని, వారం రోజుల్లో నిన్ను మీ ఊరుకు పంపిస్తానని వసుంధర లక్ష్మికి తెలిపింది. అంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement