మనసిచ్చానన్నాడు.. కలిసి జీవితం పంచుకుందాం అని మాయ మాటలు చెప్పాడు.
మణుగూరు(ఖమ్మం): మనసిచ్చానన్నాడు.. కలిసి జీవితం పంచుకుందాం అని మాయ మాటలు చెప్పాడు. సహజీవనం చేసి బాబు పుట్టాక ఆచూకీ లేకుండా పోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళ ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరు పీ వీ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్(26) హైదరాబాద్‌లో ఉంటూ ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తున్న సునీత(22)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల వారికి తెలియకుండా వీరిద్దరు నగరంలో సహజీవనం చేయడం ప్రారంభించారు.
వీరికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటినుంచి ప్రవీణ్‌కుమార్ తీరు మారడంతో పాటు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సునీత తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన సునీత బంధువులు ప్రవీణ్‌కుమార్ ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారు. ఆ దాడి గురించి ముందే తెలిసిన ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
కాగా.. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్ ఉంటున్న చోటు కూడా తనకు తెలియకపోవడంతో పలు చోట్ల వెతికిన సునీత చివరకు విసిగిపోయి.. స్థానిక పీవీ కాలనీలోని ప్రవీణ్ ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. బుధవారం తన కుటుంబ సభ్యులతో పాటు మహిళ సంఘాల సహకారంతో ప్రవీణ్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పింది.