కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో గిరిజమ్మ(36) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
కుందుర్పి (కళ్యాణదుర్గం) : కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో గిరిజమ్మ(36) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు... మృతురాలి భర్త శ్రీనివాసులు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో చీటికీ మాటికి భార్యతో తరచూ గొడవపెట్టుకునేవాడు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ సోమవారం రాత్రి గొడవపడ్డాడు. దీంతో ఆమె ఇక భరించలేకపోయింది. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత వంటగదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి, వెంటనే ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వివరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. గిరిజమ్మ మృతికి కారణమైన భర్త శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణశాస్త్రీ బాధితురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.